నిస్సిగ్గుగా...: కర్ణాటక పరిణామాలపై వైఎస్ జగన్ ట్వీట్

YS Jagan reacts on Karnataka affairs
Highlights

కర్ణాటక పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు. కర్ణాటక ఎపిసోడ్ రాజ్యాంగం గెలిచిందని ఆయన అన్నారు.

హైదరాబాద్: కర్ణాటక పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు. కర్ణాటక ఎపిసోడ్ రాజ్యాంగం గెలిచిందని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విటర్ ఆయన తన అభిప్రాయాలను పోస్టు చేశారు. కర్ణాటకపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

కర్ణాటకలో కన్నా ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్ లో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారంటూ కర్ణాటకలో బిజెపిపై ఆరోపణలు వచ్చాయి, ఎపి సిఎం చంద్రబాబు ఇక్కడా ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి, తానెంతటి అప్రజాస్వామికవాదో నిరూపించారని అన్నారు.

అందులో నలుగురిని మంత్రులుగా కూడా చేసి  రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని, వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ సమావేశాలను తమ పార్టీ బహిష్కరించినా చర్యలు లేవని అన్నారు. 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినా.. చంద్రబాబు రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.

కర్ణాటకలో కనీసం తప్పు అని తెలిసి, అల్లరి అవుతుందేమోనని వెనకడుగు వేశారని, కానీ ఇక్కడ తప్పని తెలిసినా, అల్లరి అవుతుందని తెలిసినా నిస్సిగ్గుగా ముందడుగే వేశారని ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 

కర్ణాటక ఎపిసోడ్ తర్వాత ఇప్పటికైనా దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ నిపుణులు, మీడియా దృష్టిపెట్టాల్సి అంశం ఇదేనని అన్నారు

loader