2004 నుంచి 2012 వరకు వరుస విజయాలు సాధించిన చెన్నకేశవరెడ్డికి మధ్యలో ఒకసారి టికెట్ కేటాయించలేదు. 2019లో టికెట్ కట్టబెట్టగా.. భారీ విజయం అందుకున్నారు. దీనిని బట్టి ఆయన జస్ట్ నిలబడితే చాలు గెలుపు పక్కా అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా ఆయన టికెట్ల ఖరారు చేసేందుకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా గత కొద్దిరోజులుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పు చేర్పులు జరుగుతున్నాయి. గెలవరని తెలిస్తే చాలు ఆప్తులైనా, ఆత్మబంధువులైనా పక్కనబెట్టేస్తున్నారు సీఎం జగన్. దీంతో తమ స్థానాలను కాపాడుకోవడానికి నేతలు గత కొన్నిరోజులుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. కానీ ఇక్కడ అంగీకరించాల్సిన విషయం ఏంటంటే జగన్ ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరి మాట వినరని. 

సామాజిక సమీకరణలు, వ్యతిరేకత, సర్వే రిపోర్టుల ఆధారంగా ఇన్‌ఛార్జ్‌లను మారుస్తున్న జగన్.. ఒక నేత విషయంలో మాత్రం వయసును కారుణంగా చూపారు. ఆయన వరుసపెట్టి విజయాలు సాధిస్తున్నప్పటికీ పెద్దాయన అని పక్కనపెట్టేశారు. ఆయన ఎవరో కాదు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి. ఇక్కడ జగన్ సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువగా వున్న స్థానం. చెన్నకేశవరెడ్డి 80 ప్లస్‌కు చేరుకోవడంతో ఆయనను పక్కనపెట్టి మరొకరికి అవకాశం కల్పించాలన్నది జగన్ ఆలోచన. కానీ చెన్నకేశవరెడ్డి ట్రాక్ రికార్డ్ సామాన్యమైనది. సైలెంట్‌గా, వివాదరహితుడిగా ఆయనకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరుంది. 

2004 నుంచి 2012 వరకు వరుస విజయాలు సాధించిన చెన్నకేశవరెడ్డికి మధ్యలో ఒకసారి టికెట్ కేటాయించలేదు. 2019లో టికెట్ కట్టబెట్టగా.. భారీ విజయం అందుకున్నారు. దీనిని బట్టి ఆయన జస్ట్ నిలబడితే చాలు గెలుపు పక్కా అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వయసును కారణంగా చూపి పక్కనపెట్టే యోచనలో జగన్ వున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే చెన్నకేశవరెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వని పక్షంలో వైసీపీని వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. 

ఒకవేళ.. జగన్ చెన్నకేశవరెడ్డిని పక్కనపెట్టేయాలని నిర్ణయిస్తే మాత్రం ఈ టికెట్ కోసం భారీగా డిమాండ్ వుంది. మాజీ ఎంపీ , బీసీ సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుక, మరో బీసీ నేత రుద్రగౌడ్, సంజీవ్ కుమార్‌లు ప్రయత్నిస్తున్నారు. అయితే వీరిలో బుట్టా రేణుక ముందంజలో వున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014లో ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక అనంతరం టీడీపీలో చేరారు. ఆపై 2019 ఎన్నికలకు ముందు సొంతగూటికి తిరిగొచ్చారు. అయితే అప్పుడు ఆమెకు టికెట్ ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకున్నారు జగన్. అయినప్పటికీ పార్టీని అంటిపెట్టుకుని వుండటం రేణుకకు ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు. మరి వీరిలో జగన్ ఎవరిని కరుణిస్తారో వేచిచూడాలి.