న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకూ రూ.838 కోట్లను ఆదాచేశామని, ప్రభుత్వ తీసుకుంటున్న వివిధ చర్యలద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెప్పారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, దీనికోసం ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. శుక్రవారం రాత్రి వైఎస్ జగన్ అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.

ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ.55,549 కోట్లుగా కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక కమిటీ ఫిబ్రవరి 2019న ఆమోదించిందని చెబుతూ దీనికి సంబంధించిన పరిపాలనపరమైన అనుమతి ఇప్పించేందుకు జోక్యం చేసుకుని, ఈ అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సని ఆయన కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ. 3,320 కోట్లు కేంద్రంనుంచి రావాల్సి ఉందని చెబుతూ ఆడబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల రూపేణా, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ.10, 610 కోట్లు మాత్రమే వచ్చిందని, గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది  విడుదల చేసిన రూ.22,000 కోట్లలో ఇది సగం మాత్రమేనని జగన్ చెప్పారు. పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

వెనకబడ్డ జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకూ రూ.1050 కోట్లు మాత్రమే వచ్చాయి. గడచిన మూడేళ్లనుంచి దీనికి సంబంధించిన ఎలాంటి నిధులు రాలేదన్న విషయాన్ని ఆయన హోంమంత్రి ముందు ఉంచారు. ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి సగటున రూ.4000 ఇస్తే, ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాల్లో కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నారని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడ్డ జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్‌ ఖండ్‌ తరహాలో విస్తరించాలని కోరారు. రెవిన్యూ లోటును భర్తీచేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తూ దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. 

2014–15 నాటికి ఈ రెవిన్యూ లోటును రూ. 22,949 గా కాగ్‌ నిర్ధారించింది. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉందని చెబుతూ దీన్ని ఇప్పించాల్సిందిగా జగన్ హోం మంత్రిని కేరారు. రాజధాని నిర్మాణంకోసం రూ.2500 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకూ రూ.1000 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేస్తూ మిగిలిన డబ్బును విడుదల చేయాల్సిందిగా ఆయన కోరారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో ప్రస్తావిస్తూ... కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని, ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని, ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకొస్తూ, దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన కోరారు. 

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.  దీనికోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రణాళిక వేసుకున్నామని, ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన అమిత్ షాకు చెప్పారు. 

దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని ఆయన చెప్పారు.హైకోర్టు కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. 

శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపనపత్రంలో ఆయన ప్రస్తావించారు.గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోందని చెప్పారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ,  శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసిందని చెబుతూ  తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ఆయన అమిత్‌షాకు  విజ్ఞప్తి  చేశారు.

మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు చరిత్రాత్మక చర్యలను తీసుకున్నామని హోంమంత్రికి వివరించారు. .విచారణను వేగంగా పూర్తిచేసి, నిర్దేశిత సమయంలోగా విచారణ చేసి శిక్షలు విధించడానికి గట్టి చర్యలు తీసుకున్నామని చెప్పారు.  ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం, ఒన్‌ స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని, సరిపడా సిబ్బందితో వీటిని బలోపేతం చేశామని చెప్పారు. ఏపీ దిశా చట్టానికి ఆమోదం తెలిపాల్సిందిగా ఆయన కోరారు. 

ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికోసం కడప స్టీల్‌ పాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం– చెన్నై కారిడర్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్‌కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలని జగన్ అమిత్ షాను కోరారు. రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగుపరచడానికి గోదావరి నదిలో నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరారు.  ఆమేరకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. 

పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా హైదరాబాద్‌లోని ఉండిపోయాయని, ఈవిషయంలో ఏపీ పోలీసు విభాగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. నిధులలేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని, అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాలని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రాజెక్టును హోంమంత్రిత్వ శాఖ 2017లో ఆమోదించిందని, ఇందులో రూ.152 కోట్లు కేంద్రం ఇవ్వాలని, రూ. 101.4 కోట్లు రాష్ట్రం భరించాలని నిర్ణయించగా, రాష్ట్రంలో గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు మూతపడిన విషయాన్ని జగన్ వివరించారు. స్టేట్‌ ఆపరేషనల్‌ కమాండ్, కంట్రోల్‌ సెంటర్, సెంట్రలైజ్డ్‌ డేటా సెంటర్, ఏపీ పోలీస్‌ అకాడమీ ఏర్పాటుకు తగిన సహాయం చేయాల్సిందిగా ఆయన కోరారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, ప్రజల భద్రతకోసం గట్టి చర్యలను తీసుకునేందుకు వీలుగా ప్రస్తుతం కేడర్‌ స్ట్రెంత్‌ను 79 సీనియర్‌ డ్యూటీ పోస్టులను 96కు పెంచాలని కూడా కోరారు.