ఎల్లో మీడియా ఎందుకు దాచింది: చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్

YS Jagan makes verbal attack on media
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు.

ఉయ్యూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ఉయ్యూరులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

చంద్రబాబును ఇంటలిజెన్స్ బ్యూర్ చీఫ్ కలిస్తే ఎల్లో మీడియా ఎందుకు దాచి పెట్టిందని ఆయన అడిగారు. అలాగే గవర్నర్ ను తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి కలిస్తే ఎందుకు దాచి పెట్టిందని ప్రశ్నించారు. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించడానికి చంద్రబాబు ఎల్లో మీడియాను మేనేజ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

ఈ నెల 30వ తేదీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు తలపెట్టిన సభపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన వ్యక్తే దీక్ష చేస్తా అన్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని ఆయన దుయ్యబట్టారు. హోదాను ఖూనీ చేసిన వ్యక్తే తిరుపతిలో సభ పెడుతారట అని అన్నారు. 

ఓ వైపు పోరాటం అంటూనే మరో వైపు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బిజెపి అన్యాయం చేసిందని అంటూనే బిజెపి మంత్రి భార్యను టీటీడి మెంబర్ గా నియమించారని అన్నారు. హోదా పోరాటానికి ఢిల్లీ వెళ్లానని చెబుకుంటున్న చంద్రాబబు అగ్రిగోల్డ్ ఆస్తుల బ్రోకరిజం చేశారని ఆరోపించారు.

నల్లధనం దాచుకోవడానికి చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారని ఆయన అన్నారు. విదేశాలకు చంద్రబాబు ప్రైవేట్ జెట్ లోనే వెళ్తారని అన్నారు. చంద్రబాబు అందరినీ మోసం చేస్తున్నాడని అన్నారు. బాబు పాలన అంటనే దగా, మోసం అని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు అవినీతిని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని జగన్ అన్నారు. వైఎస్సార్ ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కుంటున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో కన్నీరు పెట్టని మహిళలు ఉన్నారా అని అడిగారు. 

చంద్రబాబుది 420 దీక్ష అని ఆయన అభివర్ణించారు. ఒక్క పూట దీక్ష కోసం రూ.30 కోట్లు వృధా చేశారని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను తూట్లు పొడిచారని అన్నారు. నోరు తెరిస్తే చంద్రబాబు అబద్ధాలు చెప్తారని అన్నారు. 

loader