అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన ఆరోపణ చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి సమీప బంధువులు టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేశారని, గత ప్రభుత్వం నిలువునా దోచుకుందని ఆయన అన్నారు. 

ఏపీ కార్పోరేషన్ ఫర్ ఔట్ సోర్స్ డ్ సర్వీసెస్ (ఆప్కాస్) ను వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టు కార్మికులు తన వద్దకు వచ్చి వారి బాధలను పంచుకున్నరని, ఇస్తామన్న జీతాలు కూడా ఇవ్వకుండా కోతలు విధించారని విలపించారని ఆయన చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడనికి లంచాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. 

గత ప్రభుత్వం చేసిన నిలుపు దోపిడీని రూపుమాపాలనే ఆప్కాస్ కు శ్రీకారం చుట్టామని, మహిళలకు యాభై శాతం ఉద్యోగాలు దక్కే విధంగా దాన్ని అమలు చేస్తామని జగన్ చెప్పారు.

గత ప్రభుత్వంలో కాంట్రాక్టులో 20 మంది పనిచేయాలని ఉంటే 15 మందితో పనిచేయించి మిగిలినవారి జీతాలను కాంట్రాక్టర్లే తీసుకునేవారని ఆయన చెప్పారు. ఇకపై సిఫార్సులకు, దళారీలకు చోటు లేదని ఆయన చెప్పారు.