ఫిరాయింపు ఎంఎల్ఏలకు వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ ను ఎంతమంది ఉపయోగించుకుంటారో తెలీదు. అయితే, తన ఆఫర్ కు జగన్ ఓ షరతు కూడా విధించారు లేండి. ఇంతకీ విషయం ఏమిటంటే, వైసిపి నుండి 23 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఫిరాయించిన వారందరికీ టిడిపిలో ఏమీ రాచమర్యాదలు జరగటం లేదు. పైగా చాలామంది ఘోర అవమానాలనే ఎదుర్కొంటున్నారు.

తమకు ఎదురవుతున్న అవమానాలతో కొందరు ఫిరాయింపులు తీవ్ర మదనపడుతున్నారట. తాము టిటిపిలోకి ఫిరాయించి తప్పు చేశామని కాబట్టి తిరిగి వైసిపిలోకి వచ్చేస్తామని కొందరు ఫిరాయింపు ఎంఎల్ఏలు జగన్ కు సంకేతాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నిటికన్నా మించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫిరాయింపులందరికీ టిక్కెట్లు ఇచ్చేది కూడా అనుమానమే.

అందుకే ఫిరాయింపుల్లో కొందరు తిరిగి వైసిపిలోకి వచ్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అదే విషయాన్ని బుధవారం జగన్ ఓ మీడియాతో మాట్లాడుతూ, చేసిన తప్పు తెలుసుకుంటే మంచిదే అన్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏలను తిరిగి పార్టీలోకి చేర్చుకునే విషయంలో ఎటువంటి అభ్యంతరమూ లేదన్నారు. అయితే, ఇక్కడే జగన్ ఓ మెలిక పెట్టారు. అదేమిటంటే వైసిపిలోకి రాదలచుకున్న ఫిరాయింపులపై తమకు సంపూర్ణ నమ్మకం కలిగితేనే పార్టీలోకి చేర్చుకుంటామని చెప్పారు. అంతేకానీ టిక్కెట్టిచ్చే విషయం మాత్రం చెప్పలేదు.