నోట్ల రద్దుతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య

పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాశారు. పెద్దనోట్ల రద్దు వెనుక ఉద్దేశాలు మంచివే అయినా సరిగ్గా అమలుచేయకపోతే అవి విఫలమవుతాయని పేర్కొన్నారు.

నోట్ల రద్దు తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా ఉందని లేఖలో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రైతుల్లో 40శాతం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. 60శాతం మంది రైతులకు వడ్డీ వ్యాపారులే ఆధారమన్నారు.

ఇప్పుడు రైతులకు ఎక్కడా డబ్బు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 95శాతం రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలు అమ్మేవారు పాతనోట్లను తీసుకోవడం లేదని తెలిపారు.

నోట్ల రద్దుతో పండిన పంటను సైతం రైతులు అమ్ముకోలేకపోతున్నారని, దీంతో మద్దతు ధరలో సగం ధరకే మధ్యవర్తులకు పంట అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 6.38 లక్షల గ్రామాల్లో నగదు ఆధారంగానే లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒకే ఒక్క నిర్ణయంతో రాత్రికి రాత్రే మార్పు రాదని అన్నారు. నోట్ల రద్దుతో చాలామంది పెళ్లిళ్లు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారని లేఖలో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు