అమరావతి: గిరిజన మహిళలకు కూడా రైతు భరోసా సొమ్మును అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతి పేద గిరిజనుడికి రెండు ఎకరాల భూమిని ఇస్తున్నామని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు అటవీ హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన లబ్దిదారులతో మాట్లాడారు. 48,053 మంది గిరిజనులకు 76, 480 ఎకరాల భూములను పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం.

1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాలపై హక్కులను కల్పిస్తూ ఆర్ఎఫ్ఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని ఆయన అన్నారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గిరిజనుల ఆదాయం పెరగాలి, పచ్చదనం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనులు తన స్వంత కుటుంబసభ్యులుగా భావిస్తున్నామని ఆయన చెప్పారు.గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక ప్రజలు  ఇబ్బందులు పడిన విషయాన్ని తాను పాదయాత్రలో గుర్తించినట్టుగా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గిరిజనులకు భూములతో పాటు ఏడాదికి రూ. 13, 500 కూడ ఇస్తామని ఆయన ప్రకటించారు.భూ వివాదాలకు తావు లేకుండా డిజిటల్ సర్వే ద్వారా భూములను పంపిణీ చేస్తామని సీఎం చెప్పారు.

ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కూడ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. గ్రామ స్థాయికి ప్రభుత్వ సేవలను తీసుకెళ్లినట్టుగా జగన్ స్పష్టం చేశారు.