అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సమీక్షలపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే పోలవరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించిన జగన్ ప్రాజెక్టు నిర్వహణ, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపోతే గత రెండు రోజులుగా జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు గత ప్రభుత్వం కరకట్టపై అక్రమంగా కట్టడాలు నిర్మించిందని నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మించిందని వైయస్ జగన్ ఆరోపించారు. 

నిబంధనలకు విరుద్ధంగా కరకట్టలపై నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ప్రజావేదిక నుంచే స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. దీంతో జగన్ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారింది. 

ఇకపోతే మంగళవారం జరిగిన కలెక్టర్లు, ఐపీఎస్ అధికారుల సమావేశంలో కూడా పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసును పదేపదే ప్రస్తావించారు. ఇసుకమాఫియా, మహిళా ఉద్యోగిపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇకపై అలాంటి ఉపేక్షలను తాను సహించబోనన్నారు. 

వరుస సమీక్షలతో సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతిపై సమీక్ష నిర్వహించనున్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా సీఆర్డీయే, ఏడీసీలు చేపట్టిన ప్రాజెక్టులు, వాటి పురోగతిపై జగన్ ఆరా తీయనున్నారని తెలుస్తోంది. 

గతంలో రాజధాని నిర్మాణంపై సీఆర్డీఏ, ఏడీసీల సంస్థలతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించేవారు. అయితే వైయస్ జగన్ అందుకు విరుద్ధంగా సమీక్ష నిర్వహించబోతున్నారు. 

సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలతో ఒకేసారి సమీక్ష నిర్వహించకుండా రెండు సంస్థలతో వేర్వేరుగా జగన్ సమీక్ష నిర్వహించనున్నారని  తెలుస్తోంది. గతంలో రాజధానిపై సమీక్ష సమావేశాలు సీఆర్డీయే, ఏడీసీలకు కలిపి జరుగుతుండేవని కానీ జగన్‌ మాత్రం విడివిడిగా సమీక్షలు నిర్వహించడంపై ఆసక్తి రేపుతోంది. 

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని భూ సేకరణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైయస్ జగన్. భూ సేకరణలో భారీ కుంభకోణం జరిగిందంటూ పదేపదే ఆరోపించారు. 

రైతుల వద్ద నుంచి భూములు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని కూడా ఆరోపించారు. ఆ భూములను పలు సంస్థలు, వ్యక్తులకు కేటాయించడం, వివిధ ప్రాజెక్టులకు అంచనాల తయారీ మొదలైన వ్యవహారాల్లో భారీ అవకతవకలు జరిగాయని జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.  

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సీఎం వైయస్ జగన్ అమరావతి రాజధాని భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని భూముల్లో భారీ కుంభకోణం ఉందంటూ కూడా ఇటీవలే ఆరోపించారు.  

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలలో సీఆర్డీయే, ఏడీసీ సంస్థల ముఖ్య కార్యదర్శులను బదిలీ చేశారు. సీఆర్డీయే ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌తోపాటు అప్పటి కమిషనర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ షణ్మోహన్‌లను బదిలీ చేసింది ఏపీ సర్కార్. 

వారి స్థానాల్లో శ్యామలరావు, డాక్టర్‌ పి.లక్ష్మీ నరసింహం, విజయలను నియమించింది. సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు సంబంధించి పలు అంశాలపై వారు ఇప్పటికే అధ్యయనం మెుదలుపెట్టారు. అంతేకాదు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. 

అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్ 1కి ప్రారంభానికి నోచుకోని ప్రాజెక్టులను, ప్రాజెక్టు ప్రారంభమై 25శాతం కూడా పూర్తి చేసుకోని ప్రాజెక్టు పనులను నిలిపివేయాని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఇప్పటికే రాజధానిలో పలు పనులు నిలిపివేశారు.

రాజధాని పనులను నిలిపివేయడంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. కొందరైతే అమరావతిని తరలించుకుపోతారంటూ కూడా మరో వివాదం రేపుతున్నారు. ఇలా రాజధాని విషయంలో వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రాజధాని నిర్మాణం, భూముల సేకరణ వంటి అంశాలపై సీఎం జ గన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు రాజధాని భూములుపై గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణను సీఆర్డీయే చైర్మన్ గా నియమించడం తెలిసిందే. 

రాజధాని నిర్మాణాలు, భూసేకరణ వంటి అంశాలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం జరిగే సీఆర్డీయే, ఏడీసీ సమీక్షలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని అటు అధికారుల్లోనూ ఇటు టీడీపీలోనూ మరో వైపు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.  

బుధవారం నిర్వహించే సమీక్షంలో రాజధాని నిర్మాణ పనులు ఎంత వరకు వచ్చాయి, భూసేకరణ జరిగిన తీరు, నిర్మాణాలు, అవినీతి, అక్రమాలపై వైయస్ జగన్ బుధవారం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.