శ్రీకాకుళం: వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో గుర్తుండిపోయేలా వ్యూహాలు రచిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే భావితరాలకు వైఎస్ జగన్ పాదయాత్ర గుర్తుండిపోయేలా ఒక పైలాన్ ఏర్పాటు చేసింది. ఈ పైలాన్ ఇప్పుడు ఇచ్చాపురం నియోజకవర్గానికే తలమానికంగా మారనుంది. 

ఈ పైలాన్ కు విజయ సంకల్ప స్థూపంగా నామకరణం కూడా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ స్థూపం ఏర్పాటులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. విజయ సంకల్ప స్థూపం ఏర్పాటులో ఒక్కో అడుగు ఓక్కో ప్రత్యేకతను తెలియజేసేలా ఏర్పాటు చేసింది.  

విజయ సంకల్ప స్థూపం చుట్టూ ఉన్నమూడు వైపుల ఉన్న ప్రాంగణం గోడపై  ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం వరకూ కోట్లాది మంది ప్రజలతో మమేకమైన ఫోటోలను, వైఎస్ జగన్ పాదయాత్రలో ఎదురైన ఘటనలు, ప్రజలతో జగన్ పంచుకున్నఅనుభూతులను ప్రతీ ఒక్కరూ చర్చించుకునేలా దృశ్యమాలికలను పొందుపరచనుంది. 

ఇకపోతే విజయ స్థూపం కింది భాగం అంతా బెంగళూరు గ్రాస్ తో గార్డెన్ గా నిర్మించారు వైసీపీ శ్రేణులు. ఇకపోతే పైలాన్ కు 15 అడుగుల మెట్లు ఉండేలా నిర్మించారు. ఈ 15 అడుగులలో మెుదటి అడుగు జగన్ ప్రజా సంకల్పయాత్ర మెుదటి అడుగుగా చెప్పుకొస్తున్నారు. 

ఇడుపులపాయలో 2017 నవంబర్ 6న ప్రారంభించిన మెుదటి అడుగుగా మెుదటి మెట్టును తీర్చిదిద్దారు. ఆ తర్వాత 13 మెట్లను 13 జిల్లాలకు గుర్తుగా నిర్మించారు. 15వ మెట్టు జగన్ చివరి అడుగు ఇచ్చాపురంలో పెట్టినందుకు గుర్తుగా నిర్మించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.  
 
ఇకపోతే మూడు అంతస్థుల విజయ సంకల్ప స్థూపం మెుదటి అంతస్థులో నవ్యాంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను గుర్తుకు తెచ్చేలా మెుట్లు నిర్మిస్తే ఇక రెండవ అంతస్థులో వైఎస్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు గుర్తుకు ఆయన నిలవెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిలువెత్తు చిత్రపటాన్ని గేలాక్సీ గ్రానైట్లతో రూపొందించారు. 

మూడో అంతస్థులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి చిత్ర పటాలను నిర్మించారు. సంక్షేమ రథసారధిగా వైఎస్ఆర్ ను గుర్తుకు తెస్తూ నాలుగు వైపులా ఆకర్షణీయంగా చిత్రపటాలను పొందుపరిచారు.  

ఇకపై భాగంలో దేశంలో అత్యున్నత స్థానం అయిన పార్లమెంట్ కు చిహ్నంగా గుమ్మటాన్ని నిర్మించి దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. ఈ జెండా రెపరెపలాడేలా విజయ సంకల్ప స్థూపాన్ని తీర్చిదిద్దారు. 

ఒకవైపు 16వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన మరోవైపు హౌరా–చెన్నై రైల్వే లైనుల మధ్య ఈ పైలాన్ రూపుదిద్దుకుంటుంది. దీంతో అటు వాహనాల్లో, ఇటు రైల్లో వెళ్లేవారి దృష్టిని ఈ కట్టడం ఆకర్షించేలా వైసీపీ ప్రణాళిక రచించింది. 

ఇకపోతే ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాపురం టౌన్ కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ విజయ సంకల్ప స్థూపాన్ని నిర్మించారు.  

వీటితోపాటు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల మీదుగా ఏ ఏ మార్గాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారో తెలియజేసేలా మ్యాప్ ను సైతం ఇందులో పొందుపరిచారు. ఈ అద్భుత కట్టడాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు.