అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూముల లావాదేవీల వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

సీబీఐ విచారణకు అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, తాము వేసిన సబ్ కమిటీ విచారణలో ఆ విషయం నిర్ధారణ అయిందని ప్రభుత్వం అంటోంది. 

అమరావతిలో గత చంద్రబాబు ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దాని నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమేనని సబ్ కమిటీ తేల్చింది. దాంతో ఆ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజదాని ప్రాంతంలో 4 వేల ఎకరాల భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సబ్ కమిటీ నివేదికను కూడా జగన్ ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని కొత్త ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తూ చంద్రబాబు నాయకత్వంలోని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భూములు చేతులు మారిన విషయంపై విచారణ చేపట్టింది. సిఐడీ విచారణ కూడా జరిగింది. ఈ విషయంలో సీఐడి కొన్ని కేసులు నమోదు చేసింది.