అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిలో జోష్ పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై జగన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆయన కులాన్ని ప్రస్తావించి, చంద్రబాబుతో సంబంధాలను అంటగట్టారు. 

చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కావడంవల్లనే, టీడీపీ గ్రాఫ్ పడిపోతుండడం సహించలేకనే రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ వంటి కొంత మంది ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ స్థితిలో టీడీపీ ఎదురుదాడికి దిగింది. రమేష్ కుమార్ అధికారాలను జగన్ ప్రశ్నించారు. 

విచక్షణాధికారాలను ఉపయోగించి ఎన్నికలను వాయిదా వేసినట్లు రమేష్ కుమార్ చేసిన ప్రకటనపై జగన్ ఎగతాళి చేశారు. ఒక రకంగా ముఖ్యమంత్రి స్థాయికి తగని వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆగకుండా రమేష్ కుమార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ విషయంలో జగన్ నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నట్లు లేదు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. 

రమేష్ కుమార్  తప్పు చేశారని చెప్పడానికి కరోనావైరస్ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కరోనా వైరస్ కట్టడికి జగన్ చర్యలను ప్రకటించారు. ఉగాది రోజు ఇళ్ల పట్టాల పంపిణీకి ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా వైరస్ కారణంగా దాన్ని జగన్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ కారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైందనే అభిప్రాయం స్థిరపడడానికి అవకాశం కల్పించారు. 

మరోవైపు, చంద్రబాబు జగన్ ను తీవ్రంగా తప్పు పట్టారు. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేత తన అనుభవంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తూ వచ్చారు. అటువంటి సీనియర్ నేత జగన్ వద్ద లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది. లేదంటే, జగన్ ఇతరుల సలహాలు వినరనే అభిప్రాయమైనా నిజమై ఉండాలి.

అదలా ఉంచితే, నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహరించిన తీరు మరింతగా ప్రజల్లోకి వెళ్లింది. దాన్ని ఆసరా చేసుకుని వైసీపీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్న తీరును, ప్రత్యర్థులపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడుల వైనాన్ని చంద్రబాబు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో విజయం సాధించారు. మాచర్ల ఘటన జగన్ ప్రభుత్వ తీరును పూర్తిగా బయటపెట్టిందని భావిస్తున్నారు. 

టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న కారుపై వైసీపీ నేతలు చేసిన దాడి తీవ్రత ప్రజల్లోకి వెళ్లడానికి అవకాశం కల్పించింది. తద్వారా వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుందనే విషయం, పోలీసులు వారికి సహకరిస్తున్నారనే విషయం ప్రజల్లోకి వెళ్లింది. దీన్ని పద్ధతి ప్రకారం ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో చంద్రబాబు ఫలితం సాధించారు. మాచర్ల ఘటనలో నిందితులు స్టేషన్ బెయిల్ ఇవ్వడం మరింతగా విమర్శలకు గురైంది.

ఈ స్థితిలో రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాయడం జగన్ ను మరింత చిక్కుల్లో పడేసింది. ఆ లేఖపై అనుమానాలు వ్యక్తం చేయడంలో వైసీపీ తొందరపాటుకు గురైనట్లు కనిపిస్తోంది. హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ధ్రువీకరించారు. దాంతో వైసీపీ మరింతగా ఆత్మరక్షణలో పడింది. ఇదే అదునుగా రమేష్ కుమార్ తాను హైదరాబాదులోని కార్యాలయం నుంచి పనిచేస్తానని ప్రకటించడం వైసీపీకి ఎదురు దెబ్బనే. జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కినుకతోనే, అనుమానంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతోంది.