జీవో నెం.1పై హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్
జీవో నెంబర్ 1పై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

జీవో నెంబర్ 1పై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా... గత బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు టీడీపీ నుంచి, పార్టీల నుంచి ఒక్కొక్కరికి రూ.24 లక్షల ఆర్ధిక సాయం అందించారు. అలాగే మృతుల పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు ఈ ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ కూడా మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు సభలో ప్రసంగించి అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే.. తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక్కరు ఘటన స్థలంలో మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పలువురు గాయపడ్డారు.
కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వంహెచ్చరించింది.
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. అయితే ప్రజల మేలు కోసమే తాము ఈ జీవో తీసుకోచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ జీవోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం జీవో నెంబర్ 1ను కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తీసుకొచ్చిందని మండిపడుతున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు సస్పెండ్ చేసింది.