కనీస మద్ధతు ధరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1న కీలక ప్రకటన చేయనుంది. ఇందుకు సంబంధించి ఏయే పంటలకు ఎంత మద్దతు ధర ఉంటుందో... అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గరా డిస్‌ప్లే రూపంలో చూపించాలని వ్యవసాయ శాఖను సీఎం జగన్ ఆదేశించారు.  

బుధవారం ఆన్‌లైన్‌లో స్పందన సమీక్షలో... జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించే అంశంపై అధికారులు రెడీగా ఉండాలని కోరారు. రైతు భరోసా కేంద్రాలు ఇందులో కీలక పాత్ర పోషించాలని సూచించారు.

కనీస మద్దతు ధర కంటే రైతులు ఎక్కువ ధరే పొందేలా చర్యలు తీసుకుంటున్నామని... కనీస మద్దతు ధర లభించకపోతే, మార్కెట్ జోక్యం తప్పనిసరిగా జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

అధికారులు పంటల వివరాల్ని ఈ-క్రాపింగ్ విధానంలో డిస్‌ప్లే చేయాలన్న సీఎం జగన్... ఏ రైతు పేరైనా మిస్సింగ్ అయితే... దాన్ని తిరిగి చేర్చాలని కోరారు. వ్యవసాయ గ్రామ సహాయకులు కూడా దీనిపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు.

వరి ధాన్యం, ఇతర పంటల దిగుబడులను సేకరించే క్రమంలో రైతుల వివరాల్ని నమోదు చేయడాన్ని అధికారులంతా సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ రైతు నుంచి ఏ రోజున దిగుబడిని సేకరించేదీ... కూపన్ల రూపంలో ఇవ్వాలన్నారు. తద్వారా ఈ సేకరణ కార్యక్రమం పక్కాగా జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 

అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర  మల్టీ పర్పస్ ఫెసిలిటీస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జగన్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు... పంట ఉత్పత్తుల సేకరణ, గిడ్డంగులు, క్లోడ్ స్టోరేజీలు, గ్రేడింగ్, సార్టింగ్, జనతా బజార్లు, పాల కూలింగ్ యూనిట్లు, ఆక్వాకల్చర్, ఈ మార్కెటింగ్ సదుపాయాలపై రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసి సాయం చేస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ ఫెసిలిటీ సెంటర్లకు కావాల్సిన భూమిని వచ్చే రెండు వారాల్లోగా అందుబాటులో ఉండేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వచ్చే సంవత్సరం ఎంపీఎఫ్‌సీల కోసం రూ.6,300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జగన్ ప్రకటించారు. 

వ్యవసాయ సలహా కమిటీల విషయంలో రాష్ట్ర స్థాయిలో, గ్రామ మండల స్థాయిలో, రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటయ్యేలా అధికారులు చూసుకోవాలని సీఎం సూచించారు. ఖరీఫ్ సమయంలో వ్యవసాయ సలహా కమిటీలు బాగా పనిచేశాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు.