అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించిన అంతర్వేది రథం దగ్ధం ఘటనపై అసలు విషయాలను బయట పెట్టెందుకు ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారంనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 5వ తేదీ రాత్రి అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై హిందూ సంఘాలతో పాటు విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశాయి.

రాష్ట్రంలోని పలు ఆలయాలపై దాడులు సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శలు చేశాయి.అంతర్వేదిలో చోటు చేసుకొన్న ఘటనను నిరసిస్తూ వీహెచ్‌పీ, బీజేపీ, జనసేనలు ఇవాళ ఛలో అంతర్వేదికి పిలుపునిచ్చాయి.

బీజేపీ, జనసేలు సంయుక్తంగా ఈ నెల 10వ తేదీన దీక్షలు నిర్వహించాయి.ఈ ఘటనను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటించింది. 

also read:బలమైన ప్రభుత్వాన్ని ఎవరు అస్థిరపరుస్తారు: ఛలో అంతర్వేదికి జై కొట్టిన జనసేనాని

సీబీఐ విచారణకు కూడ చేయించేందుకు తాము సానుకూలంగా ఉన్నామని ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం ప్రకటించింది. ఈ విషయమై సీబీఐ విచారణకు ఆదేశించాలని జగన్ ప్రభుత్వం  నిర్ణయం తీసుకొంది.  ఈ మేరకు ఈ నెల 11 వ తేదీన ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

also read:అంతర్వేది ఘటనపై సీబీఐ విచారకు సిద్దం: అంబటి రాంబాబు

అంతర్వేదిలో రథం దగ్ధం కావడంతో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ను 15 రోజుల పాటు అక్కడే ఉండాలని ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఈవోను నియమించింది.

రథం దగ్ధం కావడంతో అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. ఈ తరుణంలో అంతర్వేదిలో 144 సెక్షన్ ను విధించారు పోలీసులు. అంతర్వేదికి వచ్చే అన్ని మార్గాలను మూసివేశారు.