అమరావతి:రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ అంబటి రాంబాబు ఆరోపించారు.  అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు కూడ తాము సిద్దమేనని ఆయన ప్రకటించారు. 

గురువారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల ముసుగులో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించాయని ఆయన విమర్శించారు. అన్ని మతాలు, కులాల వాళ్లంతా కలిసి మెలిసి రాష్ట్రంలో బతుకుతున్నామని ఆయన గుర్తు చేశారు.

మత విద్వేషాలు సృష్టించి దాని ముసుగులో రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. అంతర్వేది ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

also read:అంతర్వేది దేవాలయానికి స్పెషలాఫీసర్: రామచంద్రమోహన్ నియమించిన ఏపీ సర్కార్

ప్రభుత్వంపై బురద చల్లేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.రథం దగ్ధం ఘటనలో దోషుల్ని పట్టుకొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదో ఒక రకమైన అంశాన్ని తీసుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం విపక్షాలకు పరిపాటిగా మారిందన్నారు. 

విధ్వంసాలు, మోసం చేయడం ద్వారానే చంద్రబాబునాయుడు నైజమన్నారు. పేదల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పేదలకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు అంతర్వేది ఘటనను విపక్షాలు ముందుకు తెచ్చాయని ఆయన విమర్శించారు. హిందూత్వం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.