అమరావతి:ఛలో అంతర్వేది కార్యక్రమంలో తమ పార్టీ పాల్గొంటుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

అంతర్వేది ఘటనపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారంనాడు స్పందించారు. అంతర్వేది  లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పవిత్ర రథం దగ్ధం అంతకు ముందు పిఠాపురం, కొండబిట్రగుంటలో చోటు చేసుకున్న ఘటనలను ఆయన ప్రస్తావించారు. 

శాంతియుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన జనసైనికులను కోరారు. ఈ ఘటనతో ప్రజల మనసులు గాయపడ్డాయన్నారు. ఈ విషయమై  నిరసన చేసే హక్కుందన్నారు. వరుస ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందన్నారు. ప్రభుత్వం సరిగా వ్యవహరిస్తే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవన్నారు.

బీజేపీ పిలుపునిచ్చిన ఛలో అంతర్వేది కార్యక్రమానికి తాము మద్దతిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తమ పార్టీ కూడ పాల్గొంటుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వంలో బాధ్యత కలిగినవాళ్ళు ఇందుకు భిన్నంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని అర్థం లేని వాదన చేస్తున్నారన్నారు. 

 151మంది ఎమ్మెల్యేలున్న మీ ప్రభుత్వాన్ని ఎవరు అస్థిరతకు గురిచేస్తారని ఆయన ప్రశ్నించారు. వరుసగా చోటుచేసుకొంటున్న ఈ ఘటనలపై బలమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.