చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరి కొత్త నినాదం మొదలుపెట్టారు. ఈ కొత్త నినాదం నెల్లూరు జిల్లా పాదయాత్రలో జగన్ మొదలుపెట్టారు. దాన్ని వైసిపి శ్రేణులు బాగా పాపులర్ చేస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో నిరుద్యోగులను ఆకర్షించేందుకు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ గుర్తుందా? సరిగ్గా ఆ హామీకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది జగన్ తాజా నినాదం.

ఇంతకీ ఆ నినాదం ఏమిటనే కదా? మీ సందేహం. ‘బాబు పోవాలి..జాబు రావాలి’ ఎలాగుంది జగన్ కొత్త నినాదం. పోయిన ఎన్నికల్లో అధికారం అందుకోవటమే లక్ష్యంగా టిడిపి ఇచ్చిన అనేక హామీల్లో  ‘జాబు కావాలంటే..బాబు రావాలి’ అనే హామీ కూడా యువతను బాగా ఆకట్టుకున్నది.

సరే, ఏ హామీ సంగతి ఎలాగున్నా మొత్తానికి చంద్రబాబైతే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిన అనేక హామీల్లాగే ఇంటికో ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి హామీ కూడా అటకెక్కింది. అదే విషయాన్ని జగన్ ప్రతీ చోటా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే, టిడిపి నుండి ఎటువంటి సమాధానం లేదనుకోండి అది వేరే సంగతి.

ఎటూ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి నిరుద్యోగభృతి హామీకి చంద్రబాబు దుమ్ముదులుపుతున్నారు. అందుకనే జగన్ చంద్రబాబును ఎద్దేవా చేస్తున్నారు. ఉద్యోగాల గురించి జగన్ మాట్లాడుతూ ‘జాబు కావాలంటే...బాబు పోవాలి’(అధికారంలో నుండి) అనే సరికొత్త నినాదాన్ని అందుకున్నారు.