Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రిగా జగన్ తొలి బహిరంగ సభ సొంత ఇలాకాలోనే...

 

 

వైయస్ జగన్ పర్యటన సందర్భంగా సీఎం బహిరంగ సభలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెన్షన్ల పెంపు పథకంపై తొలి సంతకం చేసిన వైయస్ జగన్ తొలి బహిరంగ సభలో అంతే ప్రాధాన్యతగా కీలక ప్రకటన చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

 

YS Jagan first public meeting at Jammalamadugu as CM
Author
Amaravathi, First Published Jul 5, 2019, 2:51 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాలో పర్యటించిన సీఎం వైయస్  జగన్ తొలిసారిగా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడా బహిరంగ సభలు నిర్వహించలేదు. తొలిసారిగా సొంత ఇలాకాలో అందులోనూ జమ్మలమడుగు నియోజకవర్గంలో వైయస్ జగన్ బహిరంగ సభ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. 

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఈనెల 8న పర్యటించనున్నారు. వైయస్ జయంతిని పురస్కరించుకుని సీఎం వైయస్ జగన్ కీలక పథకాలను ప్రారంభించనున్నారు. 

ఇకపై వైయస్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో రాష్ట్ర స్థాయి రైతు సదస్సు నిర్వహించాలని వైయస్ జగన్ నిర్ణయించారు. 

అదేరోజు వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ల పెంపు పథకాన్ని కూడా అదేవేదికగా జగన్ ప్రారంభించబోతున్నారు. వైయస్ఆర్ పెన్షన్ పథకంగా నామకరణం చేసి ఆరోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం వైయస్ జగన్.  

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొనడం విశేషం. అది కూడా సొంత జిల్లాలో కావడం మరో విశేషం. వైయస్ జగన్ తొలిబహిరంగ సభలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు కడప నుంచే శ్రీకారం చుట్టడం విశేషం. 

ఇకపోతే వైయస్ జగన్ పర్యటన సందర్భంగా సీఎం బహిరంగ సభలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెన్షన్ల పెంపు పథకంపై తొలి సంతకం చేసిన వైయస్ జగన్ తొలి బహిరంగ సభలో అంతే ప్రాధాన్యతగా కీలక ప్రకటన చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

తన సొంత జిల్లా కావడంతో వైయస్ జగన్ కడప జిల్లాకు వరాలు కురిపించే అవకాశం ఉందని కూడా జిల్లా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ చేపడుతున్నారు. 

ఇప్పటికే సర్వే బృందాలు రిగ్గులు వేసి ఆయిల్‌ నిక్షేపాలు, ఖనిజాలకోసం అన్వేషణ చేపట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాళెం మండలాల పరిధిలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. దానిపై సర్వేలు కూడా జరిగాయి. 

ఇలాంటి తరుణంలో అదే ప్రాంతంలో వైయస్ జగన్ బహిరంగ సభ నిర్వహించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏదైనా పరిశ్రమ పెట్టి జిల్లా వాసులకు శుభవార్త చెప్పబోతున్నారా అంటూ కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  

మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయపరంగా బద్దశత్రులు అయిన మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు అడ్డా జమ్మలమడుగు నియోజకవర్గం. గతంలో బద్దశత్రువులుగా ఉన్న ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు ఇటీవలే ఒక్కటై చేతులు కలిపారు. 

సయోధ్యతో ఎన్నికల్లో పోటీచేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారి అడ్డాలో జగన్ బహిరంగ సభ నిర్వహించడం రాజకీయంగా వేడి రగులుతోంది. మెుత్తానికి వైయస్ జగన్ తొలి బహిరంగ సభపై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. జగన్ కీలక ప్రకటన చేయబోతున్నారంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలను జగన్ ఏం చేస్తారో అన్నది తెలియాలంటే మరో 3 రోజులు ఓపిక పట్టాల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios