అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం నాడు ప్రారంభమైంది. వైఎస్ జగన్  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే.

వైఎస్ జగన్‌ సహ 25 మందితో  పూర్తి స్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.  ఈ కేబినెట్  సమావేశం సోమవారం నాడు సచివాలయంలో ప్రారంభమైంది.  వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ సోమవారం ఆమోద ముద్ర వేయనుంది. దీనితో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, హోంగార్డుల జీతాలు పెంపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని  రెండు రోజుల క్రితం జగన్ హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు  కేబినెట్‌లో  ఉద్యోగుల ఐఆర్ పెంపుకు ఆమోదం తెలపనుంది.  మరో వైపు సీపీఎస్‌ను రద్దు చేసేలా చర్యలు తీసుకొంటామని  ఆయన ప్రకటించారు.  ఈ విషయమై మంత్రివర్గంలో చర్చించనున్నారు.

ఆర్టీసీ కార్మికులు ఈ నెల 13 నుండి  సమ్మెను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ సమ్మె తలపెట్టిన జేఎసీ నేతలతో  ఆదివారం నాడు మంత్రి పేర్ని నాని చర్చించారు. మరో వైపు ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేస్తామని  జగన్ హామీ ఇచ్చారు.  ఈ విషయమై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.