ఎడ్లబండి తోలిన జగన్

Ys jagan drives bullock cart in pattikonda segment
Highlights

  • ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్లూరు సమీపంలో ఎద్దుల బండి తోలారు.

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్లూరు సమీపంలో ఎద్దుల బండి తోలారు. జగన్ కోసమనే స్ధానికులు ఓ ఎడ్లబండిని ప్రత్యేకంగా అలంకరించి తీసుకువచ్చారు. ఎడ్లను కూడా బాగా ముస్తాబు చేశారు. చివరకు చెర్నాకోలాకు కూడా రంగు కాగితాలు, పార్టీ గుర్తులున్నజెండాలతోనే అలంకరించారు. స్ధానికులు ఒత్తిడితో చివరకు జగన్ ఎద్దులబండి పైకెక్కారు. దాంతో జగన్ అభిమానులు, స్ధానికులు ఒక్కసారిగా కేరింతలు కొడుతుండగా ఎడ్లను జగన్ అదిలించి కొద్దిసేపు నడిపారు. దాంతో అక్కడంతా ఒకటే కేరింతలు, తప్పట్లు. సరే, సందడికి ఎడ్లు బెదరకుండా వాటి సొంతదారులు బండి ముందు కాపు కాసారులేండి. పాదయాత్ర మొదలైన 17 రోజులుకు తమ గ్రామంలో జగన్ ఎడ్ల బండి ఎక్కారంటూ అక్కడున్న వారందరూ సంబరంగా చెప్పుకున్నారు.

తర్వాత మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టిన జగన్ ను ముస్లిం మత పెద్దలు కలిసారు. పత్తికొండ నియోజకవర్గంలోని పుట్లూరు, చెరుకుల పాడు తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నపుడు స్ధానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా విపరీతంగా హాజరయ్యారు. అదే సందర్భంగా తనను కలసిన ముస్లింమత పెద్దలతో జగన్ మాట్లాడుతూ, వైసిపి అధికారంలోకి రాగానే మసీదు, చర్చి, దేవాలయాల నిర్వహణకు రూ. 15 వేలు ఖర్చుల క్రింద అందిస్తామని హామీ ఇచ్చారు. తమకు 8 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ముస్లింలు అడిగారు. మసీదు ఇమాములకు నెలకు రూ. 10 వేల వేతనం ఇస్తామన్న జగన్ హామీతో ముస్లింలు ఫుల్లు ఖుషీ అయిపోయారు.

పత్తికొండ నియోజకవర్గం ఇన్ చార్జి శ్రీదేవి సమన్వయంతో జగన్ పాదయాత్ర పొడుగూతా జనాలు విపరీతంగా హాజరవుతున్నారు. ఇటీవలే చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్ధులు హత్య చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నారాయణరెడ్డి భార్యే శ్రీదేవి. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నుండి శ్ర్రీదేవే పోటీ చేస్తుందని జగన్ అప్పట్లోనే ప్రకటన చేసిన సంగతి కూడా అందిరికీ గుర్తుండే ఉంటుంది. నారాయణరెడ్డి హత్యకు గురయ్యాడన్న సంపతి,  నియోజకవర్గంపై శ్రీదేవికున్న పట్టు, జగనపై అభిమానం అన్నీ కలిసి పాదయాత్రలో జనాలు విపరీతంగా హాజరవుతున్నారు. కృష్ణగిరి గ్రామస్తులతో జగన్ ముఖాముఖి కూడా నిర్వహించారు. తర్వాత చిన్నపాటి బహిరంగ సభ కూడా జరిగింది.

 

loader