పులివెందుల: త్వరలోనే మనందరికీ మంచి రోజులు వస్తాయని... మీ అందరి దీవెనలే శ్రీరామరక్ష అని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించారు. జగన్ మంగళవారం నాడు పులివెందుకు చేరుకొన్నారు. బుధవారం నాడు జగన్ తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.

బుధవారం నాడు ఉదయం నుండి సాయంత్రం  వరకు ప్రజా దర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి జగన్ వినతి పత్రాలను స్వీకరించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మనందరికీ కూడ మంచి రోజులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ మహిళ తన బిడ్డకు అనారోగ్యం  ఉందని... వైద్యం చేయించాలని  జగన్‌ను కోరింది. అయితే ఈ నెల 29 లేదా 30వ తేదీన తనను కలువాలని ఆయన సూచించారు. వైద్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

ప్రజా దర్బార్ పలువురు జగన్‌ను కలిసి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయనకు ముందస్తుగానే  శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీ పడ్డారు. జగన్‌ను కలిసేందుకు జనం పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.

పులివెందులకు చెందిన వైసీపీ నేత పద్మనాభ రెడ్డి ఇంటికి సాయంత్రం వెళ్లి నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించారు. ఆ తర్వాత అక్కడి నుండి నేరుగా ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్‌లో పాల్గొన్నారు.