పాదయాత్రలో ఉన్న వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 85వ రోజు పాదయాత్రలో భాగంగా జగన్ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో బిజిగా ఉన్నారు. అయితే, బడ్జెట్ కేంద్రంగా వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం సాయంత్రం పార్టీ ఎంపిలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

గడచిన నాలుగు బడ్జెట్లలోనూ కేంద్రం ఏపికి అన్యాయం చేసినా నొరెత్తని చంద్రబాబునాయుడు ఇపుడు మాత్రం హటాత్తుగా కేంద్ర అన్యాయం చేసిందంటూ రాద్దాంతం చేస్తున్నట్లు మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెడుతున్నట్లు ధ్వజమెత్తారు.

ప్రత్యేకహోదా వల్లే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని వైసిపి చెప్పినపుడు హేళన చేసిన చంద్రబాబు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే హడావుడి చేస్తున్నట్లు జగన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయాలను సమీక్షిస్తూనే భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకే జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. చంద్రబాబుపై ఒత్తిడి పెంచటమే లక్ష్యంగా జగన్ వ్యూహాలుంటాయని సమాచారం.