అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయడం వెనక మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రమేయం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరోక్షంగా ఆరోపించారు. చంద్రబాబుది రమేష్ కుమార్ ది ఒకే సామాజిక వర్గం కావచ్చునని ఆయన అన్నారు.తన సామాజిక వర్గానికి చెందిన అధికారి రమేష్ కుమార్ ను చంద్రబాబు నియమించుకున్నారని ఆయన అన్నారు. పెద్దాయన అంటూ ఆయనపై వ్యాఖ్య చేశారు.

స్థానిక సంస్థలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటనపై వైఎస్ జగన్ ఆదివారం మీడియా సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. రమేష్ కుమార్ నిర్ణయంపై ఆయన ప్రతి మాటలో ఆగ్రహం, అసహనం కనిపించింది. రమేష్ కుమార్ ను చంద్రబాబు నియమించారని ఆయన చెప్పారు. విచక్షణాధికారం అనే మాటను వాడుతున్నారని, ఎవరు పడితే వారు.. ఎప్పుడు పడితే అప్పుడు విచక్షణాధికారం అనే మాట వాడడం అలవాటై పోయిందని ఆయన అన్నారు. 

Also Read: ఎవడో ఆర్డర్ రాస్తున్నాడు, రమేశ్ కుమార్ చదువుతున్నాడు: ఈసీపై జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని ఆయన అన్నారు. వ్యవస్థలో తనవారిని ఉపయోగించుకుని వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు గ్రాఫ్ ఇంకా పడిపోతుందనే ఉద్దేశంతో ఎన్నికలను వాయిదా వేశారని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారని ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వ్యాఖ్యానించారు. మార్చి 31వ తేదీలోగా ఎన్నికలు జరిగితే 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయని, దాదాపు 5 వేల కోట్ల నిధులు వస్తాయని, అలా జరగకపోతే ఆ నిధులను కోల్పోతామని ఆయన అన్నారు. ఆ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలని, ఆ నిధులు వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ఎక్కడో ఓ దగ్గర వాడుతామని ఆయన చెప్పారు. 

Also Read: గవర్నర్ కు ఈసీపై ఫిర్యాదు: 'స్థానిక' వాయిదాపై జగన్ తీవ్ర ఆసంతృప్తి

ఆ డబ్బులు రాకూడదని కుట్ర చేశారని జగన్ ఆరోపించారు. కేవలం చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదనే తప్పించి మరేమీ లేదని ఆయన అన్నారు. రమేష్ కుమార్ కు ఎన్నికల కమిషనర్ కు ఉండాల్సిన లక్షణం లేదని, రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారని ఆయన అన్నారు. ఓ వైపు ఎన్నికలను వాయిదా వేస్తూనే సంక్షేమ కార్యక్రమాల అమలును నిలిపేయాలని ఆదేశాలు జారీ చేస్తారని, అధికారులపై చర్యలకు ఆదేశిస్తారని, అన్నీ ఆయనే చేశాక తామెందుకు అని ఆయన అన్నారు.