విడుదలైన 24 గంటలలోపే టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను తిరిగి అరెస్ట్ చేయడంపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు: విడుదలైన 24 గంటలలోపే టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను తిరిగి అరెస్ట్ చేయడంపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర స్వభావం కలిగిన జగన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ఎంత ప్రమాదమో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. ప్రజల్ని గాలికొదిలేసి కరోనాని కూడా కక్ష సాధింపు కోసం వాడుకునే నీచ స్థితికి జగన్ దిగజారిపోయారని మండిపడ్డారు.
''కరోనా సమయంలో స్వైర విహారం చేసి వైరస్ వ్యాప్తికి కారణమైన వైసిపి నాయకులపై చర్యలు శూన్యం. పైగా కరోనా పెద్ద విషయం కాదంటూ సెలవిచ్చారు. ఇప్పుడు కరోనా పేరుతో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి లను అరెస్ట్ చేసారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని అన్నారు.
''కక్ష సాధింపులో భాగమే జేసీ కుటుంబంపై కరోనా, అట్రాసిటీ కేసులు. విడుదలైన 24 గంటల్లోపే మళ్ళీ జైల్లో పెట్టి జగన్ సైకో ఆనందం పొందుతున్నారు. కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై పెట్టి ఉంటే ఈ రోజు ప్రజలకు ఇన్ని కష్టాలు ఉండేవి కావు'' అని లోకేష్ విమర్శించారు.
read more జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి తిరిగి అరెస్ట్... జగన్ కు చంద్రబాబు హెచ్చరిక
ఇక అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి కుట్రా రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలే అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు బెయిల్ పై విడుదలయిన రోజే తిరిగి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.
''నియంతలు పాలకులైతే పరిపాలన ఇలాగే ఉంటుంది. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారు. ఇకనైనా కక్ష సాధింపు చర్యలు విడనాడి తెలుగుదేశం నాయకులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలి. లేనిపక్షాన వైసిపి నాయకుల రాక్షస సంస్కృతికి ప్రజలే భవిష్యత్తులో తగిన బుద్ది చెబుతారు'' అని చంద్రబాబు హెచ్చరించారు.
