పవన్‌ను తిట్టి.. కాపులను కదిలించి జగన్ "బీసీ" స్కెచ్..?

ys jagan bc sketch against chandrababu naidu and pawan kalyan
Highlights

గత ఎన్నికల్లో కాపుల సత్తా ఎంటో తెలిసి కూడా..  జగన్ తిరిగి ఈ తేనే తుట్టెను ఎందుకు కదిల్చారనే దానిపై విశ్లేషకులు కూడా ఏటు తేల్చుకోకుండా ఉన్నారు.. అయితే దానికి జగన్ దగ్గర పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ వేత్తలు

గత కొద్దిరోజులుగా ప్రత్యేకహోదా.. అవిశ్వాసం చుట్టూ తిరిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీల చూపు కాపుల మీదే.. తాను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ అమలు చేయలేనని.. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసినట్లు తప్పుడు హామీలను తాను ఇవ్వలేన్నారు.. కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర పరిధిలో లేదని.. ఒకేవేళ దీనికి రాష్ట్రం అనుమతించినా సుప్రీంకోర్టు, కేంద్రప్రభుత్వం అంగీరించవని ప్రతిపక్షనేత చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను మార్చేశాయి. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలతో సైలెంట్ అయిన కాపు నేతలు తిరిగి యాక్టివ్ అయ్యారు. ముద్రగడ లాంటి నేతలు ప్రభుత్వానికి డెడ్‌లైన్లు పెడుతున్నారు కూడా.. మరోవైపు తమకు వ్యతిరేకంగా మాట్లాడిన జగన్‌పై కాపులు ఫైరవుతున్నారు.. ప్రస్తుతం ఆయన ఆ సామాజిక వర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండటంతో వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.. 

గత ఎన్నికల్లో కాపుల సత్తా ఎంటో తెలిసి కూడా..  జగన్ తిరిగి ఈ తేనే తుట్టెను ఎందుకు కదిల్చారనే దానిపై విశ్లేషకులు కూడా ఏటు తేల్చుకోకుండా ఉన్నారు.. అయితే దానికి జగన్ దగ్గర పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ వేత్తలు.. కాపులకు రిజర్వేషన్ కల్పించడంపై బీసీలు తొలి నుంచి గుర్రుగానే ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు ఈ నిర్ణయం ఏమాత్రం రుచించడం లేదు. 

అటు ఇటైతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి గుణపాఠం నేర్పించాలని వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారికి తన స్టాండ్ ఏంటో చెప్పడానికే జగన్ ఈ పాచిక విసిరారని కథనాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత వ్యాఖ్యలు సహజంగానే బీసీలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ చీఫ్ దశాబ్డాలుగా వున్న బీసీల సపోర్ట్‌ను పొగొట్టుకుంటారా..? లేక అధికారాన్ని దగ్గర చేసే కాపులను బలపరుస్తారా..? తేల్చుకునేలా జగన్మోహన్ రెడ్డి పావులు కదిపినట్లుగా తెలుస్తోంది. 

ఇక తనకు కులం ముద్ర ఆపాదించవద్దని తాను అందరివాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు.. కాపునాడు ఎంతగా ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పవర్‌స్టార్ వారిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన కాపుల గురించి స్టాండ్ తీసుకోక తప్పని పరిస్థితిని జగన్ కల్పించారని అంటున్నారు విశ్లేషకులు. కాపులంతా జనసేన పక్షం వహిస్తే టీడీపీకి నష్టం జరిగి తనకు లాభం కలుగుతుందని ప్రతిపక్షనేత భావన. 

ఇక కొద్దిరోజుల క్రితం పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకువచ్చి కాపుల ఆగ్రహానికి గురైనందున.. వారిని చల్లార్చడానికి కూడా జగన్ ఈ ఎత్తుగడ వేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కాపుల ఆధిపత్యాన్ని సహించని ఇతర వర్గాలను తనవైపుకు తిప్పుకునే ప్రణాళికలో భాగంగా కూడా వైసీపీ అధినేత ఇలాంటి వ్యూహం రచించారని.. మొత్తం మీద ఒకే దెబ్బతో రెండు పార్టీలను ఇరకాటంలోకి నెట్టేందుకు జగన్ బాగానే ప్రయత్నించారని.. సామాజిక సమీకరణాల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సాహసం ఏ మేరకు ఫలితాలనిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

loader