రాజమహేంద్రవరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఏడాది కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. 

గత ఏడాది అక్టోబర్ 25న విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ముగించుకుని కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరేందుకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు. 

ఎయిర్ పోర్ట్ లోని వీఐపీ లాంజ్ లో వేయిట్ చేస్తున్న వైఎస్ జగన్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు శ్రీనివాస్. జగన్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన శ్రీనివాసరావు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే సోమవారం రాత్రి శ్రీనివాసరావుకు తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

దీంతో అతనిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే శ్రీనివాసరావు అస్వస్థతకు గురైన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అటు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వైద్యులు సైతం శ్రీనివాసరావు విషయంపై నోరు మెదపడం లేదు. 

అయితే శ్రీనివాసరావు ప్రస్తుతం రాజమండ్రి ఆస్పత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి సీరియస్ గా ఉందని ప్రచారం జరగుతోంది. శ్రీనివాసరావు ఆరోగ్యం కుదుటపడకపోతే అతనిని కాకినాడ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.