తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గురువారం ఉదయం ముందుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న జగన్ మహాద్వారంవద్ద యడియూరప్పకు స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఇరువురు ముఖ్యమంత్రులకు ఆశీర్వచనం పలికారు. 

యడియూరప్పకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శేషవస్త్రం సమర్పించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాలు ఇరువురు సీఎంలకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు ఆ తర్వాత ముఖ్యమంత్రులు ఇరువురు సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. 

శ్రీవారి దర్శనం కోసం వచ్చే కర్ణాటక భక్తుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్రాల నిర్మాణం చేపడుతోంది. ఇందుకు తిరుమలలో జరిగిన భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో యడియూరప్పతో కలిసి జగన్ పాల్గొన్నారు. రూ.200 కోట్ల ఖర్చుతో కర్ణాటక ప్రభుత్వం ఆ వసతి గృహ సముదాయాన్ని నిర్వహించనుంది. రోజుకు 1800 మంది బస చేసేదుకు వీలు కల్పిస్తూ ఆ నిర్మాణాలు చేపట్టారు.

ఇదిలావుంటే, సీఎం వైఎస్ జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆయన గురువారంనాడు తిరుమల నుంచి నేరుగా హైదరాబాదు వెళ్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న మామ గంగిరెడ్డిని ఆయన పరామర్శిస్తారు.