వైసిపి ఎంపిల రాజీనామాకు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారు. నెల్లూరు జిల్లాలో మంగళవారం కలిగిరిలో బహిరంగ సభలో మాట్లాడుతూ, ఏప్రిల్ 6వ తేదీ వరకూ ప్రత్యేకహోదా కోసం ఎదురు చూస్తామన్నారు. ఒకవేళ కేంద్రం గనుక దిగిరాకపోతే అదేరోజు తమ పార్టీ ఎంపిలందరూ తమ పదవులకు రాజీనామాలు చేస్తారంటూ స్పష్టంగా ప్రకటించారు.

ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ ఒకేసారి అటు కేంద్రంపైనే కాకుండా ఇటు చంద్రబాబునాయుడుపైన కూడా ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహం పన్నారు. అందులో భాగంగానే లోక్ సభ ఎంపిల రాజీనామాల విషయం ప్రస్తావించారు. ఒకవేళ వైసిపి ఎంపిలు గనుక రాజీనామాలు చేస్తే చంద్రబాబుపై ఒత్తిడి పెరగటం ఖాయం.

ఇప్పటికే కేంద్రమంత్రుల రాజీనామాలని, టిడిపి ఎంపిల చేత రాజీనామాలు చేయించమంటూ చంద్రబాబుపై అన్ని వైపుల నుండి ఒత్తిడి వస్తున్న విషయం అందరకీ తెలిసిందే. ఇటువంటి నేపధ్యంలోనే జగన్ అదును చూసి చంద్రబాబుపై పంజా విసిరారు.