వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారు. ఇప్పటి వరకూ రెండు అసెంబ్లీ సీట్లలో అభ్యర్ధులను ప్రకటించిన జగన్ తాజాగా మూడో అభ్యర్ధిని ప్రకటించారు. కర్నూలు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ పోటీ చేస్తారని ప్రకటించారు. కర్నూలులో పోయిన ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. అందుకనే తాజగా జగన్ ఓ ముస్లిం అభ్యర్ధిని రంగంలోకి దింపారు.

ఎందుకంటే, కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. సుమారు 25 వేల వరకూ ముస్లిం ఓట్లు ఉండవచ్చు. ముస్లింలను ఆకట్టుకోవటంలో భాగంగానే జగన్ హపీజ్ ఖాన్ కు టిక్కెట్టు కేటాయించారు. తాజా ప్రకటనతో కర్పూలు జిల్లాలోనే రెండు సీట్లు ప్రకటించినట్లైంది. పత్తికొండలో గతంలోనే శ్రీదేవిరెడ్డిని ప్రకటించిన సంగతి అందరకిీ తెలిసిందే.

కర్నూలులోని రాయల్‌ ఫంక్షన్‌ హాలులో కర్నూలు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా నెల్లూరుజిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న నేతల అబిప్రాయాలను సేకరించిన గౌతమ్ రెడ్డి పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు హఫీజ్‌ ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.  హఫీజ్ కన్నా పార్టీలో సినయర్లు చాలా మందే ఉన్నారు. అందరినీ కాదని హఫీజ్ కు టిక్కెట్టు ప్రకటించటంలో ఎత్తుగడ స్పష్టమవుతోంది. అయితే మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.