సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్న నేపధ్యంలో, పాదయాత్ర పుంజుకుంటున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఓ సామాజికవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టిడిపి బలాన్ని దెబ్బతీయాలంటే కమ్మ సామాజికవర్గం మద్దతు లేకుండా సాధ్యం కాదన్న విషయం జగన్ కు బాగా అర్ధమైంది.

అందుకనే ప్రత్యేకించి కమ్మ సామాజికవర్గం నేతలను వైసిపిలోకి చేర్చుకోవటంపై ప్రత్యకమైన దృష్టి పెట్టారు. పనిలో పనిగా ఒక్క కమ్మ సామాజికవర్గం అనే కాకుండా వీలైనన్ని సామాజికవర్గాలను పార్టీలోకి ఆహ్వానించాలన్నది జగన్ ఆలోచన.

అందులో భాగంగానే విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ యలమంచిలి రవిని వైసిపిలోకి చేర్చుకుంటున్నారు. అంతుకుముందే విజయవాడ నగరానికే చెందిన తెలుగు యువతనేత ఎస్వీఆర్ చౌదరిని కూడా పార్టీలోకి చేర్చుకున్నారు. ఇంకా పలువురు నేతలతో మాటలు జరుగుతున్నట్లు సమాచారం.

అదే సమయంలో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంకు చందిన నిమ్మకాయల రాజరత్నంతో పాటు మున్సిపాలిటీ మాజీ వైఎస్ ఛైర్మన్ నాగేశ్వారర్రావును కూడా పార్టీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో రాజరత్నం బిసి సామాజికవర్గానికి చెందిన గట్టిపట్టున్న నేత.

బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా త్వరలో వైసిపిలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రత్తిపాడు టిడిపి ఎంఎల్ఏ, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు పశ్చిమ టిడిపి ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాల రెడ్డి కూడా త్వరలో వైసిపి తీర్ధం పుచ్చుకుంటారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది.

ఇతర పార్టీల నుండి నేతలను వైసిపిలోకి చేర్చుకునే విషయాన్ని తెరవెనుక నుండి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ, అంబటి రాంబాబులు పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పై రెండు జిల్లాలోని 32 నియోజకవర్గాల్లో కనీసం 20 నియోజకవర్గాల్లో గెలవాలని జగన్ లక్ష్యగా పెట్టుకున్నట్లు సమాచారం.