అమరావతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల పర్యటనలో వున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ లో మరోసారి మార్పులు జరిగాయి. తిరుమల నుండి నేరుగా రాజధాని అమరావతికి చేరుకోవాల్సిన జగన్ అత్యవసరంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు బయలుదేరారు. ఇప్పటికే రేణిగుంట విమానాశ్రయం నుండి ఆయన హైదరాబాద్ కు పయనమయ్యారు. 

తీవ్ర అనారోగ్యం కారణంగా సీఎం భార్య వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో చేరారు. దీంతో ఆయనను పరామర్శించేందుకు జగన్ హుటాహుటిన హైదరాబాద్ కు వస్తున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి  నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకి చేరుకోనున్న సీఎం అక్కడి నుండి నేరుగా తన మామ చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్లనున్నారు. పరమర్శ అనంతరం తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో 1:20కి  గన్నవరం చేరుకోన్నారు సీఎం జగన్. 

ఇటీవల ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి పెదనాన్నపెద్ద గంగిరెడ్డి(78) గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఆ బాధ నుండి కోలుకోకముందే తాజాగా భారతి సొంత తండ్రి అనారోగ్యం పాలయ్యారు.