సోమయాజులు మృతి: వైఎస్ భారతి, హుటాహుటిన హైదరాబాద్ కు జగన్

YS Bharathi condoles the death of Somajajulu
Highlights

వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి సాక్షి మీడియా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతి నివాళులు అర్పించారు.

హైదరాబాద్: వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు భౌతికకాయానికి సాక్షి మీడియా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతి నివాళులు అర్పించారు. సోమయాజులు మృతి పట్ల  ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయామని చెప్పారు. సోమయాజులు మరణం తీరని లోటని అన్నారు.

శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 03.14 నిమిషాలకు కన్నుమూశారు. డీఏ సోమయాజులు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్‌ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపొందించడంలో కీలక భూమిక పోషించారు.

సోమయాజులు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారంనాటి పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని ఆయన హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు. 

మెహిదీపట్నంలోని డీఏ సోమయాజులు నివాసానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ ఆయన భౌతికకాయానికినివాళులర్పించారు. సోమయాజులు కుటుంబసభ్యుల్ని వైఎస్‌ జగన్‌ ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కూడా సోమయాజులు నివాసానికి వచ్చారు. 

పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు కూడా సోమయాజులు భౌతికకాయానికి నివాళులర్పించారు.

loader