మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్‌లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 14న తన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్‌ను ఇవ్వాలని సీబీఐని ఆదేశించాలని కోరారు. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో.. సీబీఐ అధికారులు నాలుగు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ తీరును అవినాష్ తప్పుబట్టారు. 

వివేకానందరెడ్డి మరణించిన సమయంలో దొరికిన లేఖను బహిర్గతం చేయాలని సీబీఐని కోరినట్టుగా అనినాష్ రెడ్డి చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ తనకు తెలిసిన వాస్తవాలతో సీబీఐకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. గూగుల్ టేక్అవుట్ అంటున్నారని.. అది గూగుల్ టేక్అవుటా? లేదా టీడీపీ టేక్‌అవుటా? అనేది భవిష్యత్తులో తేలుతుందని అన్నారు. సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌లో చెప్పిన విషయాన్ని టీడీపీ ఏడాది క్రితమే ఎలా చెప్పిందని ప్రశ్నించారు. గత విచారణ సందర్భంగా మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారని.. ఈసారి అలా ఏం చెప్పలేదని అవినాష్ రెడ్డి తెలిపారు. 

మరోవైపు ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే 24 గంటల్లోనే అవినాష్ రెడ్డి ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.