ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. తనను కూడా ప్రేమించాలంటూ ఆమెను వేధించాడు. అయితే.. అతని ప్రేమను ఆమె కాదంది. అతను ఎంత వెంటపడినా.. పట్టించుకోలేదు. దీంతో.. తన ప్రేమను అంగీకరించలేదనే కారణంతో యువతిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. ఈ దారుణ సంగటన విజయవాడలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడకు చెందిన చిన్నారి అనే యువతిని ప్రేమిస్తున్నానంటూ అదే ప్రాంతానికి చెందిన నాగభూషణం అనే  యువకుడు వెంట పడ్డాడు. రోజూ ప్రేమ పేరిట వేధింపులకు గురిచేశాడు. ఇందుకు యువతి నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నాగభూషణం... యువతిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. చిన్నారి పూర్తిగా దగ్ధమై ఘటనాస్థలంలోనే మృతి చెందగా... నాగభూషణం 80 శాతం కాలినగాయాలవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

నాగభూషణం పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.  మృతురాలు చిన్నారి కృష్ణ జిల్లా విస్సన్నపేట నివాసిగా గుర్తించారు. అలాగే హత్య చేసిన యువకుడు నాగభూషణం రెడ్డి గూడెం నివాసిగా పోలీసులు తెలిపారు. హనుమాన్ పేటలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్‌లో మృతురాలు నర్సుగా పనిచేస్తోంది. వారం క్రితమే నాగ భూషణం మీద చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇకపై వెంట పడను అని చెప్పటంతో మృతురాలు ఫిర్యాదును వెనక్కి తీసుకుంది.