సమాజంపై సినిమాల ప్రభావం మంచిగా ఉంటుందో లేదో తెలీదు కానీ చెడుగా మాత్రం ఉంటుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలిచింది. దండుపాళ్యం సినిమా గుర్తుంది కదా? అందులో కొందరు ఓ ముఠాగా ఏర్పడి నేరాలు చేస్తుంటారు. సరిగ్గా అలాంటి పద్దతిలోనే కొందరు యువకులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. చిన్న చిన్న నేరాలు మొదలుపెట్టారు.

సీన్ కట్ చేస్తే, విశాఖపట్నంలో యోగా టీచర్ వెంకటరమణ హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. హత్యకు సంబంధించిన ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. పోలీసులైతే హంతకుల కోసం వెతుకుతూనే ఉన్నారు.

ఈ విషయం అలా ఉండగానే పెందుర్తి దగ్గర మారుమూల గ్రామంలో గస్తీలో ఉన్న పోలీసులు కొందరు యువకులను పట్టుకున్నారు. వారంతా బహిరంగంగా  మద్యం తీసుకుంటున్నారని పోలీసులు పట్టుకున్నారు. పోలీస్టేషన్ కు తీసుకెళ్ళి వారిని విచారించే సమయంలో పోలీసులకు కొత్త విషయం తెలిసింది.  వారిలో కొందరికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

దాంతో అప్రమత్తమైన పోలీసులు వారిని మరింత లోతుగా తమదైన పద్దతిలో విచారించారు. దాంతో యోగా టీచర్ హత్య విషయం వెలుగుచూసింది. అజేయ్ కుమార్, కల్యాణ్, అనిల్, పవన్ తో పాటు మరికొందరికి హత్యలో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. దండుపాళ్యం సినిమా చూసిన తర్వాత కొందరు యువకులు ఓ బ్యాచ్ గా ఏర్పడి నేరాలు మొదలుపెట్టారు. అలా చిన్న నేరాలతో మొదలైన వీరి వ్యవహారం చివరకు యోగా టీచర్ హత్య దాకా వెళ్ళింది. హత్యలో భాగస్వామ్యం ఉన్న వాళ్ళలో అత్యధికులు చిన్నప్పటి నుండి నేరచరిత్ర ఉన్నవాళ్ళే అని తేలింది. దాంతో పట్టుబడిన వారిచ్చిన సమాచారంతో మిగిలిన వాళ్ళ కోసం గాలిస్తున్నారు.