దెయ్యం వేషాలతో హడలెత్తించిన యువకులు

విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో గురువారం అర్ధరాత్రి దెయ్యాలు హల్ చల్ చేశాయి. నిజంగా దెయ్యాలు తిరిగాయా.. భయపడిపోకండి. ఎందుకంటే.. అవి నిజమైన దెయ్యాలు కాదు. 
 కొందరు యువకులు చేసిన పని ఇది. షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో దెయ్యాల వేషాలు వేసుకొని స్ధానికులను భయభ్రాంతులకు గురి చేశారు.

 రాత్రివేళ గస్తీ తిరుగుతున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకులని అదుపులోకి తీసుకొని మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం పోలీసు అధికారులు ఆ యువకులకు 
కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అర్ధరాత్రి దెయ్యం వేషాల్లో తిరగడంతో స్ధానికులు, వాహన చోదకులు నిజమైన దెయ్యాలే వచ్చాయనుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని అదుపులోకి తీసుకున్న తరువాత ఆకతాయి యువకులని గుర్తించి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఆకతాయి చర్యలతో ప్రజలను భయపెడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.