పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రోహిత్ అనే ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రేమించిన అమ్మాయి వచ్చేదాకా తాను దిగనని మొండికేశాడు అమ్మాయి రాకపోతే సెల్ టవర్ మీదినుండి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. 

విషయం తెలుసుకున్న ఇన్ ఛార్జ్ సీఐ మల్లేశ్వరరావు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. రోహిత్ కిందికి దిగి రావాలని సూచించాడు. పోలీసులు కాసేపు బుజ్జగించిన తరువాత రోహిత్ కిందికి దిగాడు. 

అయితే రోహిత్ సెల్ టవర్ నుండి కిందికి దిగుతున్న టైంలో పక్కనే చెట్టుమీదున్న తేనెతుట్టె కదిలింది. తేనెటీగలు చెలరేగి రోహిత్ మీద దాడి చేశాయి. అనుకోని ఈ ఘటనకు రోహిత్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే పక్కనే ఉన్న కల్యాణ మండపంలోకి దూకేశాడు. 

తేనెటీగలు పోలీసులు, మీడియా సిబ్బందిమీదికి కూడా దాడి చేయడంతో వారంతా పరుగులు తీశారు. దూకడం వల్ల గాయాలపాలైన రోహిత్ ను జంగారెడ్డి గూడెంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.