ఆంధ్రాలో ప్రముఖుల కొడుకులంతా 2019 అసెంబ్లీ బరిలో దూకేందుకు రంకెలు వేస్తున్నారు

2019 లో ఆంధ్రా అసెంబ్లీ కొడుకుల హబ్ అయ్యే అవకాశాలు జోరుగా ఉన్నాయి. బడానేతల కొడుకులంతా అసెంబ్లీకి రావడానికి తహతహ లాడుతున్నారు.

మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ముసలి తల్లితండ్రులను ఇక విశ్రాంతి తీసుకోండని చెబుతున్నారు. లేదా రాష్ట్రం వదలేసి పార్లమెంటు దారి పట్టండని వత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. కొన్ని చోట్ల నేతలు తమ్ముళ్లను , కూతుళ్లను కూడా ప్రోత్సహిస్తున్నారు. అయితే వీరి సంఖ్య బాగా తక్కువ. కొన్ని ప్రాంతాలలో కొడుకుల కోసం తండ్రులు స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కుటుంబాలలో చిన్న ప్రిక్షన్ మొదలయినట్లు సమాచారం. కొడుకులేమో తొందరగా రాజకీయాలల్లోకి వచ్చేందుకు తొందరపడ్డుతున్నారు. అపుడే ఏమోచ్చింది, ముందు నియోజవర్గంలో పనిచేసిన పేరు తెచ్చుకో అని కొడుకులను తండ్రులు వారిస్తున్నారట.

మొతానికి ఆంధ్రలో జనరేషన్ చేంజ్ పెద్ద ఎత్తున జరుగ బోతున్నది. నిజానికి ఈ ప్రాసెస్ వైఎస్ ఆర్ మరణంతో మొదలయిందని చెప్పాలి. ఇపుడు ఉపందుకుంటూ ఉంది.

 జగన్ అతి చిన్నవయసులోపార్టీ స్థాపించి విజయవంతమయిన నాయకుడిగా పేరుపొందాడు. అతి చిన్న వయసులో ప్రతిపక్ష నాయకుడయిన ఘనత కూడా ఆయనదే. దానికి ఆయన పడిన కష్టాలు అంతా ఇంతాకాదు, ఇది కూడా రికార్డే. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ ఎలాంటి కష్టం లేకుండా కాబోయే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఎమ్మెల్సీ అయ్యాడు. అపై ఐటి మంత్రి అయ్యారు. ఇక మరొక సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు మరణానంతరం కుమారుడు రామ్మోహన్ నాయకుడు కూడా సులభంగా వారసత్వం సంపాదించాడు.

 మిగతా వాళ్ల పరిస్థితి ఇంత సులభంగా ఉండకపోవచ్చు. మొదట వాళ్లకు తల్లితండ్రులు దారి ఇవ్వాలి. రెండు,మంచి నియోజకవర్గం దొరకాలి. 2019లో నెగ్గాలి. ఇది కొంత కష్టమే. అయినా సరే, ఎన్నికల పోరాటానికి సిద్ధమంటున్నారు కుర్రకారు. ఇలాంటి వారిలో కొందరిని చూద్దాం. పరిటాల శ్రీరామ్ అనంతపురం జిల్లా నుంచి అసెంబ్లీకి రావాలనుకుంటున్నాడు. దీనికి తల్లి, మంత్రి సునీత పక్కకు తప్పుకోవాలి. లేకపోతే, ఒకే కుటుంబానికి రెండు సీట్లివ్వడం కష్టం. అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కు సీటు గ్యారంటీ. ఎందుకంటే కుళ్లు రాజకీయాల్లో ఇక పోటీచేయనని జెసి ప్రకటించారు. ఇక కర్నూలు జిల్లాకొస్తే ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణ మూర్తి కూడా కొడుకు శ్యామ్ బాబు కోసం రాజీనామా ప్రకటించేశారు. మరొక తెలుగుదేశం నేత కరణం బలరాం ప్రకాశం జిల్లాలో రాజకీయ కష్టాల్లో ఉన్నాడు. బాబు దగ్గిర ఆయన పలుకుబడి కొంత తగ్గింది. అందువల్ల ఆయన కుమారుడు కరణం వెంకటేశ్ ని ఈ సారి ఎన్నికల్లో నిలబెడతారంటున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపినేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్ హ్యాపీ గా ఉన్నారు. అందువల్ల ఆయన కూడా కుమారుడు భానుకు టిడిపి టికెట్ అడగాలనుకొంటున్నారట. మాజీ మంత్రి బొజ్జల కూడా అనారోగ్యం కారణంగా కొడుకు సుధీర్ ను నిలబెడతాడని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గౌతు శివాజీ కూతురు శిరీష అసక్తి ఉన్నారు. అమె ఇపుడు శ్రీకాకుళం టిడిపి అధ్యక్షురాలు కూడా. మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి కూతురు స్వాతిరాణి అసెంబ్లీకి రావాలనుకుంటున్నారు. ఆమె విజయనగం జడ్ పి ఛెయిర్ పర్సన్ గా ఉన్నారు.

ఈ జాబితాలో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ కుమారుడుభరత్ కు కర్నూలు అసెంబ్లీ సీటు కావాలట. అదే విధంగా ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు, కుమారుడు శివరామకృష్ణకు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడికి, మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ కి టికెట్లు కావాలట. వీటన్నింటికంటే ముఖ్యంగా నారాలోకేశ్ భార్య నారా బ్రాహ్మణి కూడా లోక్ సభకు పోటీచేస్తారని తెగప్రచారం జరుగుతుంది. ఇక వైఎస్ ఆర్ పార్టీకి సంబంధించి కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా చక్రపాణిరెడ్డి కుమారుడు శిల్పా కార్తీక్‌, శిల్పా మోహనరెడ్డి కుమారుడు శిల్పా రవి కూడా అసెంబ్లీ బరిలోకి దూకాలనుకుంటున్నారు. మొత్తానికి అంధ్రా అసెంబ్లీ 2019లో రూపు రేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.