మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా? అయినా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈసీ గుర్తించిన ఐడీ కార్డులను ఉపయోగించి కూడా ఓటు వేయవచ్చు. ఆ కార్డులు ఏవంటే...
అమరావతి : ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కే కాదు బాధ్యత కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటే ప్రజల వజ్రాయుధం. దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రజల చేతిలోనే పెట్టారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఓటును కొందరు లైట్ తీసుకుంటున్నారు... ఓటు వేయడానికి బద్దకిస్తున్నారు. దీంతో చాలాచోట్ల పోలింగ్ శాతం కనీసం 50 శాతం దాటని పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిసార్లు చిన్నచిన్న అనుమానాలు ఓటర్లను పోలింగ్ కు దూరం చేస్తున్నాయి. అలాంటి అనుమానాల్లో ఒకటే ఓటర్ ఐడీ లేకపోతే ఓటు వేయనివ్వరనేది. కానీ ఎలక్షన్ కమీషన్ మాత్రం ఓటర్ ఐడీ లేకున్నా ఓటు వేయవచ్చని చెబుతోంది.
ఏదయినా ఎన్నికల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఐడికార్డులను ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఈసీ స్పష్టం చేస్తోంది. ఓటర్ ఐడి లేకున్నా ఈసీ సూచించిన గుర్తింపు పత్రాలను తీసుకెళ్లి నిశ్చింతగా ఓటేయవచ్చు. ఎన్నికల అధికారులు కూడా ఆ గుర్తింపు కార్డులను అనుమతివ్వాలని... ఓటర్ కార్డు లేదని అభ్యంతరం చెప్పకూడదని ఈసీ ఆదేశించింది. కాబట్టి ఓటర్ ఐడీ లేదనో... సమయానికి దొరకడం లేదనో మీ అమూల్యమైన ఓటు హక్కును ఉపయోగించుకోకుండా వుండొద్దు. కింద పేర్కొన్న గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని తీసుకుని పోలింగ్ బూత్ కు వెళ్లండి... ఓటేయండి.
ఓటర్ ఐడీ లేకున్నా ఓటేయడానికి అనుమతించే కార్డులివే :
ఆధార్ కార్డ్
MNREGA జాబ్ కార్డ్
డ్రైవింగ్ లైసెన్స్
పాన్ కార్డ్
ఇండియన్ పాస్‌పోర్ట్
పెన్షన్ కార్డ్
గవర్నమెంట్ సర్వీస్ కార్డ్
ఫోటోతో పాస్‌బుక్, స్మార్ట్ కార్డ్
హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్
ప్రభుత్వ సంస్థల గుర్తింపు కార్డ్
ప్రత్యేక అంగవైకల్య కార్డ్
గమనిక : ఓటర్ ఐడీ కార్డు లేకున్నా ఓటు వేసే అవకాశం వుంటుంది. కానీ ఓటర్ లిస్ట్ లో పేరు లేదంటే ఓటు వేయడం కుదరదు. కాబట్టి ఓటర్ లిస్ట్ లో మీ పేరు వుందో లేదో చేక్ చేసుకోవడం ఎలాగో ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకొండి. https://telugu.asianetnews.com/andhra-pradesh/how-to-check-your-name-in-voter-list-akp-sdcq04
