ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. యోగా డే వేడుకల కోసం ఆయన రెండ్రోజులు విశాఖలో ఉంటారు. ఈ క్రమంలో ఆయన విశాఖలో దిగగానే ఓ సామాన్య మహిళ నాగమణి స్వాగతం పలకనున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా?

PM Modi Vizag Visit : అంతర్జాతీయ యోగా డే వేడుకలకు ఈసారి విశాఖపట్నం వేదిక అవుతోంది. 11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం విచ్చేస్తున్నారు. జూన్ 20న అంటే ఇవాళే ఆయన విశాఖకు చేరుకోనున్నారు... రేపు (జూన్ 21న) ఉదయం జరిగే యోగా డే వేడుకల్లో పాల్గొంటారు. అయితే ప్రధానికి విశాఖలో సరికొత్త స్వాగతాన్ని ఏర్పాటుచేస్తోంది కూటమి ప్రభుత్వం.

సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి స్వాగత ఏర్పాట్లు చేస్తుంటారు అధికారులు. కానీ ఇవాళ (జూన్ 20న) ప్రధాని మోదీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో ప్రోటో కాల్ ను కాస్త పక్కనబెట్టారు. యోగా డే వేడుకల కోసం విశాఖకు వస్తున్న ప్రధానికి పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులు స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పహల్గాం ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన తెలుగు వ్యక్తి చంద్రమౌళిది విశాఖపట్నమే. విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి అయిన ఆయన మరికొందరితో కలిసి జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో ఇతడు బలయ్యాడు. దీంతో ఇతడి కుటుంబం దు:ఖసాగరంలో మునిగిపోయింది. ఇలా ఇంటిపెద్దను కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి ప్రధాని మోదీని కలిసే అవకాశం కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం.

విశాఖలో దిగగానే ప్రధాని మోదీ చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఇలా చంద్రమౌళి భార్య నాగమణి పేరును ప్రధానికి స్వాగతం పలికేవారి జాబితాలో చేర్చారు అధికారులు. ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా ప్రధానిని కలిసే అవకాశం కల్పిస్తున్నారు.

ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ :

ప్రధాని మోదీ రెండ్రోజులు (జూన్ 20,21) విశాఖలో ఉంటారు. ఇవాళ రాత్రికే విశాఖకు చేరుకోనున్న ఆయన రేపు ఉదయం యోగా డే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇలా ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం.

జూన్ 20న డిల్లీ నుండి నేరుగా బిహార్ కు వెళతారు ప్రధాని మోదీ. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు.. ఇలా రూ.5736 కోట్ల విలువైన పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

బిహార్ నుండి మధ్యాహ్నానికి ఒడిశా చేరుకుంటారు ప్రధాని.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం విశాఖపట్నంకు బయలుదేరతారు... సాయంత్రం 6.45 గంటలకు విశాఖ వైమానిక స్థావనం ఐఎన్ఎస్ డేగాలో ప్రధాని విమానం ల్యాండ్ అవుతుంది.

వైమానిక స్థావరం నుండి నేరుగా తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. జూన్ 21న ఉదయం 6.30 గంటలకు యోగా డే వేడుకలు జరిగే ఆర్కే బీచ్ కు చేరుకుంటారు. ఉదయం 7.45 గంటలవరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ యోగా డే వేడుకలకు హాజరవుతున్నారు. అలాగే ఐదు లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

ప్రధాని మోదీతో పాటు అందరూ యోగసనాలు వేయనున్నారు. కొద్దిసేపు యోగా అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇలా ఉదయం 11.50 గంంటల వరకు విశాఖలోనే ఉండనున్నారు ప్రధాని... అనంతరం తిరిగి వైమానిక స్థావరం నుండి డిల్లీకి పయనం అవుతారు.

విశాఖలో ముమ్మరంగా యోగా డే ఏర్పాట్లు :

ఈసారి యోగా డే వేడుకలను కూటమి ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఇందుకోసం విశాఖపట్నంను రెడీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. దీంతో యావత్ దేశం చూపు విశాఖవైపే ఉంటుంది. కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యోగా డే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన ఇవాళ మధ్యాహ్నానికి విశాఖకు చేరుకుని మరోసారి ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఈ యోగా డే వేడుకల ఏర్పాట్లను మంత్రుల కమిటీ చూసుకుంటోంది.

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు... ఇలా ప్రముఖ నాయకుల పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే యోగా డే కార్యక్రమం జరిగే ఆర్కే బీచ్ రోడ్డును మూసివేసారు... ఈ ప్రాంతంలో డ్రోన్లను నిషేధించారు.. అలాగే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసారు... రేపు భద్రతను మరింత పెంచనున్నారు.

విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటుచేసిన ప్రధాన వేదికవద్ద 323 కంపార్ట్ మెంట్స్ ఏర్పాటుచేసారు. అలాగే 2 వేలకుపైగా సిసి కెమెరాలను కూడా ఏర్పాటుచేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి ఓ యోగా మ్యాట్, టీషర్ట్ తో పాటు ఓ ఓఆర్ఎస్ బాటిల్ ఫ్రీగా అందించనున్నారు. తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.