కోళ్లు దొంగిలించారన్న అనుమానంతో నగ్నంగా కూర్చోబెట్టి.. కటింగ్ ప్లేయర్ తో మర్మాంగాలు నొక్కిపట్టి..
కోళ్లు దొంగతనం చేశారన్న అనుమానంతో వైసీపీ నేతలు దారుణానికి ఒడిగట్టారు. ముగ్గురు యువకులను నగ్నంగా చేసి తీవ్రంగా కొట్టారు. ఓ దళిత బాలుడి మర్మాంగాలను కటింగ్ ప్లేయర్ తో నొక్కి పట్టారు.

ఏలూరు : ఆంధ్రప్రదేశ్లో స్థానిక వైసీపీ కార్యకర్తలు కొంతమంది వ్యక్తులను విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులను కోళ్లు దొంగిలించారన్న అనుమానంతో దారుణంగా హింసించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల 25వ తేదీ రాత్రి అరటికట్ల రాంబాబు, ముప్పిన సురేష్, మరో దళిత బాలుడిని అదే గ్రామానికి చెందిన కొంతమంది పిలిచారు, వీరిలో కొనకల్ల అప్పారావు, గంటా శేఖర్, ఆచంట రాకేష్, అప్పసాని ధర్మారావు, మురుగుల దుర్గారావు, తోకల సిద్దిరాజులు ఉన్నారు. వీరు ఆ ముగ్గురిని నాటు కోళ్లు పెంచే తోటలోకి పని ఉందని చెప్పి తీసుకెళ్లారు.
భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష .. వారికి రూ.10వేలు ఇవ్వండి : అధికారులకు జగన్ ఆదేశాలు
అక్కడికి వెళ్లిన తర్వాత వారిని మా కోళ్లను మీరే దొంగిలించారా అని బెదిరిస్తూ ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ ముగ్గురు యువకుల దుస్తులు వింపించి, నగ్నంగా కూర్చోబెట్టారు. ఇదంతా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వారు చూస్తుండగానే కర్రలు, ప్లాస్టిక్ పైపులతో వారిని కొట్టి చిత్రహింసలు పెట్టారు.
బాధితుల వీపుపై వాతలు తేలి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక బాధితులు ముగ్గురిలో ఓ బాలుడు దళితుడు కావడంతో… అతడిని ‘మా కోళ్ళనే ఎత్తు కెడతావా? ఈరోజు మా చేతుల్లో చచ్చావ్’.. అంటూ కులం పేరుతో దూషించారు. అంతటితో ఆగకుండా అతని బట్టలు విప్పించి.. అందరూ చూస్తుండగానే కటింగ్ ప్లేయర్ తో మర్మంగాలను నొక్కి పట్టారు. చేతిపై ఉన్న చర్మాన్ని కత్తిరించారు.
అక్కడి నుంచి వచ్చిన తర్వాత గురువారం నాడు ఈ విషయాన్ని అరటి కట్ల రాంబాబు, ముప్పిన సురేష్ పోలీసులకు తెలిపారు. అవమానానికి గురైన బాలుడు కూడా శుక్రవారం నాడు పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. పోలీసులు ముగ్గురు బాధితులని ఏలూరు జిల్లా ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిని తీవ్రంగా కొట్టడం వల్లనే గాయాలయ్యాయని వైద్యులు నిర్ధారించారు.
దీంతో ఆరుగురు నిందితులపై ఎస్సీ ఎస్టీ అడ్రస్ సిటీ కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్ తెలిపారు. ఈ ఘటన గురించి ఆయన మాట్లాడుతూ ముగ్గురు మీద కర్రలతో దాడి చేశారని… అయితే బాలుడి మర్మాంగాల మీద దాడి చేసిన గుర్తులు లేవని చెప్పుకొచ్చారు. మరోవైపు శుక్రవారం నాడు స్థానిక వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలైన నిందితులను తప్పించేందుకు బాధితులతో రాజీ ప్రయత్నాలు చేశారు. ఓ ప్రజా ప్రతినిధితో బాధితులతో ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ బాధితులు ఒప్పుకోలేదు. దీంతో కేసు నమోదు అయింది.