చట్టం చేసిన టీడీపీయే కూల్చివేస్తుందా.... తాడేపల్లి కార్యాలయం కూల్చివేతపై వైసీపీ వాదనలు

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున అధికారులు కూల్చివేశారు. అక్రమంగా చేపట్టారన్న కారణంతో ప్రొక్లెయినర్ల సాయంతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. అయితే, దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

YCP, TDP arguments on demolition of YCP office... GVR

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిందో లేదో గత ప్రభుత్వానికి సంబంధించిన వాటి ప్రక్షాళన మొదలుపెట్టేసింది. తొలుత వైసీపీకి అనుకూలురుగా ముద్ర వేసుకున్న అధికారులను సాగనంపింది. సీఎస్‌, టీటీడీ ఈఓ మొదలు కలెక్టర్లు, ఎస్పీల వరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులందరినీ కూటమి ప్రభుత్వం పక్కనపెడుతోంది. అలాగే, వైఎస్సార్‌, జగన్‌ పేరుతో ఉన్న పథకాల పేర్లను మార్చేస్తోంది. తెలుగుదేశం హయాంలో ఉన్న పథకాల పేర్లను కొనసాగిస్తూ.. జగన్‌ ప్రభుత్వం కొత్తగా పెట్టిన పేర్లను తొలగించి కొత్త పేర్లు పెడుతోంది. అటు గ్రామ, వార్డు సచివాలయాల్లో జగన్‌ ఫొటోలు తొలగించడంతో పాటు వైసీపీ రంగులు కనిపించకుండా చర్యలు తీసుకుంటోంది. 

తాజాగా రాష్ట్రంలో వైసీపీ కార్యాలయం కూల్చివేత హాట్‌ టాపిక్‌గా మారింది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారన్న కారణంతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున తాడేపల్లి కార్పొరేషన్‌ సిబ్బంది కూల్చేశారు. ఈ భవనం నిర్మాణానికి సంబంధించి ఏ దశలోనూ నిబంధనలు పాటించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, వైసీపీ కార్యాలయం మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో జలవనరుల శాఖకు చెందిన బోట్‌యార్డు స్థలంలో కృష్ణా బకింగ్‌హాం కాలువను ఆనుకుని ఉంది. ఆ స్థలానికి యజమాని అయిన ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంటు నుంచి వైసీపీ ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. ఒప్పందాలూ చేసుకోలేదు. పైగా అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా వైసీపీ నిర్మాణం చేపట్టిందట. 

ఈ నేపథ్యంలో గత మే నెలలో వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు అందాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు నోటీసులు కూడా అందించారు. అయితే, వైసీపీ నాయకులు సమాధానాలు ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించి చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఉదయాన్నే రంగంలోకి దిగిన అధికారులు పోలీసు బందోబస్తు నడుమ పొక్లెయిన్లతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. 

అయితే, ఈ చర్యను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులు న్యాయవ్యవస్ధ ఆదేశాలను తుంగలో తొక్కారని మాజీ అడ్వొకేట్ జనరల్ పొన్ననోలు సుధాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చట్టం, కోర్టులు వాటి ఆర్డర్లు తెలిసిన వ్యక్తిగా అవి బేఖాతరు అయిన పరిస్థితుల్లో, లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు.  

సూర్యోదయానికి ముందే సుమారు 4 గంటలకు మొదలుపెట్టి… కోర్టు ఆర్డరు ఉన్నా వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారని మాజీ ఏఏజీ పొన్నవోలు వాపోయారు. అసలు రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్ధలాలు ఇవ్వాలని జీవో తీసుకొచ్చిందే గత చంద్రబాబు ప్రభుత్వమని గుర్తుచేశారు. …  దీనికి సంబంధించి 21-07-2016 నాడు  జీవో ఎంఎస్ నెంబరు 340ను గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. దీని ప్రకారం గుర్తింపు ఉన్న జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ప్రతి జిల్లాలో వారి కార్యాలయాలు నిర్మించుకోవడానికి, ఆయా పార్టీల ప్రాతినిధ్యం బట్టి.. దిగువ సభలో 50 శాతం మంది సభ్యులు ఉంటే… అంటే 175 మంది ఎమ్మెల్యేల్లో 50 శాతం మంది ఉంటే ఆ పార్టీకి 4 ఎకరాలు ప్రతి చోటా స్ధలం ఇవ్వాలని జీవో నంబరు 340 తీసుకొచ్చిందే చంద్రబాబు ప్రభుత్వమని చెప్పారన్నారు. 
దీని ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎకరా స్థలం కేటాయించారని, మంగళగిరి మండలం ఆత్మకూరులో జాతీయ రహదారికి ఆనుకుని టీడీపీ ఆఫీసుకి కేటాయించారని పొన్నవోలు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఎకరాకు రూ.వెయ్యి లీజు చెల్లించి వైసీపీ కూడా కార్యాలయాలు నిర్మించిందని తెలిపారు. 

ప్రభుత్వం మారినా రాజ్యాంగం మారదని, వ్యక్తులు మాత్రమే మారుతారని పొన్నవోలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీజుకి తీసుకున్న 2 ఎకరాల స్థలం.. సీఆర్డీయే ప్రాంతంలో ఉందని, దానికి పర్మిషన్ తీసుకోలేదని నోటీసులు ఇచ్చారన్నారు. సీఆర్డీయే సెక్షన్ 108 ప్రకారం పర్మిషన్ తీసుకోవాలని చట్టం నిర్దేశించిందన్న ఆయన… సదరు స్థలం సర్వే నెంబరును ప్రభుత్వ ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తీయలేదని తెలిపారు. దాంతో వైసీపీ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసినా.. వర్చువల్ పోర్టల్ రిసీవ్ చేసుకోలేదన్నారు. 

వైసీపీ వాదనను టీడీపీ తొసిపుచ్చింది. ఏ అనుమతులూ లేకపోయినా, ఎన్నికలు జరుగుతున్నా వైసీపీ యుద్ధ ప్రాతిపదికన పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిందని ఆరోపించింది. ఎలాంటి అనుమతుల్లేకుండా మొదటి అంతస్తు పూర్తిచేసి రెండో అంతస్తుకు పిల్లర్లు నిర్మించడంతోనే సదరు భవనాన్ని పునాదులతో సహా పెకిలించేసినట్లు తెలియజేసింది. ఈ వాదనను సీఆర్డీయే కూడా బలపర్చింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారం తమకు ఉందని పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios