విద్యుదాఘాతంతో వైసీపీ కార్యకర్త ఒకరు మృతి చెందారు. మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన ఏర్పాట్లలో భాగంగా... మదనపల్లిలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు భావించారు.

ఈ క్రమంలో మదనపల్లి సెంటర్ లో మిథున్ రెడ్డికి స్వాగత బ్యానర్లు కడుతుండగా... ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త మోహన్ నాయక్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా... అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. కాగా... మోహన్ నాయక్ చనిపోగా.. మరో ముగ్గురు వైసీపీ నేతలు తీవ్రగాయాలపాలయ్యారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు.

మిథున్ రెడ్డి పర్యటన సమయంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా... బాధిత కుటుంబాన్ని ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించే అవకాశం ఉంది.