చంద్రబాబునాయుడుకు వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సవాలు విసిరారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణకు సిద్దమా అంటూ ఛాలెంజ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పోలవరంపై విచారణ జరిపితే చంద్రబాబు నెలరోజుల్లోపే జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. ప్రభుత్వం ప్రాజెక్టు అంచనాలను మూడింతలు పెంచి, రెండింతలు మింగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. పెట్టుబడులపై చంద్రబాబు తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు.

అపోలో టైర్స్ ఫ్యాక్టరీ పెట్టుబడులపైన కూడా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అపోలో టైర్స్‌ రూ.1,800 కోట్లు పెట్టుబడి పెడుతోందని ప్రభుత్వం ఊదరగొట్టిందని అన్నారు. కానీ కంపెనీ వెబ్‌సైట్లో చూస్తే రూ. 525 కోట్ల పెట్టుబడులను మాత్రమే పెడుతున్నట్లు ఉందన్నారు. విశాఖపట్టణంలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సుపైనా ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్దాలని ఆరోపించారు.

లక్షల కోట్ల పెట్టుబడులూ లేవు.. లక్షల మందికి ఉద్యోగాల కల్పనా లేదు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు చెబుతున్నట్లు రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చుంటే కనబడాలి కదా అంటూ నిలదీసారు. అలాగే, 7 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని చెబుతున్న చంద్రబాబు ఎక్కడెక్కడ ఉద్యోగలిచ్చారో చెప్పాలన్నారు.

ఇప్పటివరకూ రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరియాని చద్రబాబు చెబుతుంటే కేంద్రం మాత్రం రూ. 12 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు మాత్రమే జరిగాయని పేర్కొంటోందన్నారు. కేంద్రం చెప్పిన లెక్కలే ప్రామాణికమన్నారు. జీడీపీ విషయంలోనూ చంద్రబాబు కల్లబుల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అపోలో టైర్స్‌ పెట్టుబడి, జీడీపీలపై వాస్తవాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.