రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైసిపిని దెబ్బ కొట్టేందుకు టిడిపి ప్రయత్నాలు ముమ్మరం  చేస్తోంది. వైసిపి ఎంఎల్ఏలకు ఏకంగా మంత్రులే ఫోన్లు చేయటం సంచలనంగా మారింది. తమ ఎంఎల్ఏలతో మంత్రులు మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని వైసిపి చెప్పటంతో రెండు పార్టీల్లో ఒక్కసారిగా కాకపుట్టింది.

ఈనెల 23వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరకీ తెలిసిందే. భర్తీ అవ్వాల్సిన మూడు స్ధానాల్లో రెండు సీట్లు టిడిపికి ఒకసీటు వైసిపికి దక్కుతుంది. అయితే, జగన్ దెబ్బ కొట్టటమే లక్ష్యంగా టిడిపి పావులు కదుపుతోంది. అందులో భాగంగానే పలువురు వైసిపి ఎంఎల్ఏలకు మంత్రులు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది.

వైసిపి వర్గాల సమాచారం ప్రకారం విజయనగరం జిల్లాలోని సాలూరు ఎంఎల్ఏ పీడిక రాజన్నదొరతో ఓ ఫిరాయింపు మంత్రి మాట్లాడారట. టిడిపిలోకి రావల్సిందిగా కోరారట. టిడిపిలోకి రావటం వల్ల వచ్చే ఉపయోగాలను కూడా వివరించారట. అయితే, మంత్రితో మాట్లాడిన రాజన్నదొర అదే విషయాన్ని వైసిపి నేతలకు చేరవేశారట. దాంతో ఎంఎల్ఏ-మంత్రికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులను వైసిపి తీసిపెట్టుకుందట.

అదే విదంగా ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రితో పాటు కోస్తా జిల్లాలకు చెందిన మంత్రి కూడా గుంటూరు వైసిపి ఎంఎల్ఏతో మాట్లాడారట. ఇదివరకే పలువురు వైసిపి ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ పై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తం మీద ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ ప్రలోభాల పర్వం ఊపందుకుంటోంది. మరి టిడిపి, వైసిపిల్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.