న్యూఢిల్లీ: తనకు బెయిల్ లభించి ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జీ అయినప్పటి నుంచి వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తున్నారు. తన అరెస్టుపై, తదనంతర పరిణామాలపై ఆయన వివిధ రూపాల్లో పోరాటం సాగిస్తూనే ఉన్నారు. మీడియాతో మాట్లాడకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలకు విఘాతం కలగకుండా ఆయన చెప్పాల్సిందంతా చెబుతూనే ఉన్నారు. 

తాజాగా ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్ప మిగతా సీఎంలందరికీ ఆ లేఖలా రాశారు. ఏపీ సిఐడి తనను అరెస్టు చేయడంపై, అరెస్టు తర్వాతి పరిణామాలపై ఆయన ఆ లేఖల్లో వివరించారు. 

పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన ఆ లేఖల్లో ఆరోపించారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని తాను సిబిఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే తనను అరెస్టు చేశారని ఆయన చెప్పారు.

పార్లమెంటులో మీ ఎంపీలు తనకు మద్దతు ఇచ్చేలా చూడాలని ఆయన సిఎంలను కోరారు. తనపై సిఐడి నమోదు చేసిన రాజద్రోహం కేసును తొలగించాలని కోరుతూ అసెంబ్లీల్లో తీర్మానాలు చేయాలని, ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఆయన సిఎంలను కోరారు.