Asianet News TeluguAsianet News Telugu

MP Balashowry: 23000 కోట్ల జగన్ సోలార్ స్కాం.. బాలశౌరి సంచలన ఆరోపణలు

 MP Balashowry: శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా జగన్ సర్కార్ ఆస్తులు కట్టబెడుతున్నదనీ వైఎస్ఆర్ రెబల్ ఎంపీ బాలశౌరి విమర్శించారు. ఇండోసోల్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరుగుతోందని ఆరోపించారు. ఇండోసోల్ కంపెనీకి విద్యుత్తు రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.23వేల కోట్ల భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

YCP Rebel MP Balashouri Reveals Jagan Scam KRJ
Author
First Published Feb 15, 2024, 11:59 PM IST

MP Balashowry: విద్యుత్తు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నడ్డివిరుస్తోందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆరోపించారు. మరోవైపు శ్రీ  షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇండోసోల్ సోలార్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీకి రాయితీపై విద్యుత్తు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.23వేల కోట్ల భారం పడుతోందని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఇప్పటికే పేదలు వినియోగించుకునే విద్యుత్తు ఛార్జీలను 7 సార్లు ఈ ప్రభుత్వం పెంచిందని ఈనేపథ్యంలో బడాబాబులు నడిపే కంపెనీలకు రాయితీపై విద్యుత్తును ఎందుకు సరఫరా చేస్తుందో తెలియజేయాలని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వం కేవలం డిస్కమ్‌లను నష్టాల నుంచి రక్షించాలన్న పేరుతో నెలకోసారి విద్యుత్తు ధరలను పెంచుతోందని, మరి బడాబాడులు నడిపే కంపెనీలకు విద్యుత్తు రాయితీలు ఇచ్చి పేదల ముక్కుపిండి విద్యుత్తు బిల్లులు ఎందుకు వసూలు చేస్తుందో సమాధానం చెప్పాలని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటనను ఎంపీ కార్యాలయం నుంచి విడుదల చేశారు.  

ఇండోసోల్ సోలార్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ పుట్టుకే అవినీతి మయం.. 

శ్రీ షిరిడీ సాయి సంస్థకు చెందిన ఇండోసోల్ సోలార్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ మొత్తం పెట్టుబడి రూ.లక్ష మాత్రమే.. కానీ ఈ కంపెనీకి ఇస్తున్న విద్యుత్తు రాయితీ విలువ మాత్రం రూ.23వేల కోట్లు అని ఎంపీ బాలశౌరి తెలిపారు. అంతేకాకుండా ఇండోసోల్‌ సోలార్ కంపెనీని 2022లోనే స్థాపించారని మరి ఇలాంటి కంపెనీకి అన్ని రూ.వేల కోట్లు విలువ చేసే విద్యుత్తును రాయితీపై అందజేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. మూలధనం రూ.లక్షతో ఉన్న కంపెనీకి ప్రభుత్వం ఇన్నిన్ని సదుపాయాలు కల్పిస్తోంది అంటే ఈ కంపెనీ పుట్టుకే అవినీతి మయం అని చెప్పవచ్చని ఎంపీ పేర్కొన్నారు.

దేశంలోనే ఇండోసోల్‌ సోలార్ అనే కంపెనీ పేరుతో అతిపెద్ద స్కాం జరుగుతోందని ఎంపీ స్పష్టం చేశారు. రాయితీతో ఇలాంటి అవినీతి కంపెనీలకు విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఏటా విద్యుత్‌ ధరలు పెరుగుతున్నాయని ఈ భారం పేదలపై పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ బకాయిలు విడుదల చేయకపోవటం వంటి కారణాలతో విద్యుత్తు పంపిణీ చేసే డిస్కంలు నష్టాల్లోకి వెళ్తున్నాయని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. దీంతో ఏటా విద్యుత్ పంపిణీ సంస్థలు యూనిట్ ధరను పెంచాలంటూ ఏపీ ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపుతుండగా.. గత్యంతర లేక ప్రభుత్వం వాటిని ఆమోదించి యానిట్‌ ఛార్జీలను నెలకోసారి పెంచుతోందని, పెరిగిన యూనిట్‌ ఛార్జీల భారం పరోక్షంగా వినియోగదారులపై పడుతోందని ఎంపీ బాలశౌరి ఆందోళన వ్యక్తం చేశారు. 

సోలార్ పీవీ మాడ్యూల్స్‌ తయారీకి 11 క్వార్ట్జ్ గనులు కట్టబెట్టడం ఎందుకు? 
 
ఇండోసోల్ సోలార్ కంపెనీ సోలార్ పీవీ మాడ్యూల్స్‌ తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ కంపెనీ సోలార్‌ ప్యానల్స్ తయారు చేస్తోంది అన్న వంకతో ప్రకాశం జిల్లాలో ఉన్న ఖరీదైన 11 క్వార్ట్జ్ గనులను నిబంధనలను అతిక్రమించి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమని ఎంపీ మండిపడ్డారు.

అదేవిధంగా ఈ కంపెనీకి రామాయపట్నంలో ఇప్పటికే దాదాపు 5000 ఎకరాలు కేటాయించడం, దీంతోపాటు మరో 3000 ఎకరాల భూమిని తక్కువ ధరలకు ఇండోసోల్‌ కంపెనీకి ప్రభుత్వం ధారాదత్తం చేసిందని ఎంపీ ఆరోపించారు. కేవలం లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును అప్పనంగా కట్టబెడుతుందంటే... ఏ స్థాయిలో ఆ కంపెనీ అక్రమాలు సాగుతున్నాయో అందరూ గమనించాల్సిన అవసరం ఉందన్నారు. 

నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అనడం ఉత్తుత్తి మాటలేనా.. 

సీఎం జగన్‌ ఏ సభలో చూసినా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ.. ఆయా వర్గాలను నిలువునా మోసం చేస్తున్నారని ఎంపీ బాలశౌరి విమర్శించారు. గతంలో చిన్న తరహా కంపెనీలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకునే వారికి రాయితీపై విద్యుత్తు అందించేవారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానం రద్దు చేశారని ఎంపీ బాలశౌరి తెలిపారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇవ్వని విద్యుత్తు రాయితీలు, అదే బడాబాబుల పేరుతో నడిపే ఇండోసోల్ వంటి కంపెనీలకు ఇవ్వడం ఆయా వర్గాలను మోసం చేయడం కాదా అని ఎంపీ ప్రశ్నించారు. తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం జగన్‌ ఇలాంటి పెత్తందారుల కోసం ప్రకృతి వనరులు కట్టబెట్టడం సరికాదని సూచించారు. చిన్న తరహా పరిశ్రమలకు బీసీ, ఎస్సీలకు ఇవ్వని విద్యుత్తు రాయితీ.. బడాబాబులు నడిపే కంపెనీలకు ఇవ్వడం ఎందుకని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు నడిపే పరిశ్రమలకు విద్యుత్తు రాయితీ ఎందుకు ఇవ్వరు? ఆ సామాజిక వర్గాలు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా అని ఎంపీ ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios