Asianet News TeluguAsianet News Telugu

రఘురామకృష్ణమ రాజు, ఆయన భార్యలపై సీబీఐ కేసు: జరిగింది ఇదీ...

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణమ రాజు చిక్కుల్లో పడ్డారు ఆయనపైనా, ఆయన భార్యపైనా సీబీఐ ఢిల్లీ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం పలు చోట్ల సోదాలు జరిగాయి.

YCP rebel MP and his wife charged in loan default case: CBI
Author
New Delhi, First Published Oct 9, 2020, 9:41 AM IST

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజుపై, ఆయన భార్య రమాదేవిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరో 9 మందిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. రఘురామ కృష్ణమ రాజుకుకు చెందిన ఇండ్- భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థతో పాటు దాని డైరెక్టర్లు, అధికారులపై సీబీఐ ఢిల్లీ విభాగం కేసు నమోదు చేసింది. 

రుణం ఇచ్చిన బ్యాంకుల తరఫున పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సౌరబ్ మల్హోత్రా ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఫిర్యాదు చేశఆరు. దాని ఆధారంగా గత మంగళవారం సీబీఐ కేసు నమోదు చేసింది.  దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాదు, ముంబై నగరాల్లోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. 

ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి.... బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంకులు కలిసి ఇండ్ - భారత్ సంస్థకు మొదట రూ.941.80 కోట్లు, దానికి అనుబంధం రూ.62.80 కోట్లు కోట్లు మంజూరు చేశాయి. 

ఇండ్- భారత్ సంస్థ మొదట కర్ణాటకలో విద్యుదుత్పత్తి సంస్థను ఏర్పాటు చేసింది. అయితే, సాంకేతిక కారణాలతో దాన్ని తమిళనాడులోని ట్యూటికోరిన్ కు మార్చింది. సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి వివిధ పద్ధతుల్లో నిధులు మళ్లించారు. విద్యుదుత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గు ద్వారా కూడా మాయ చేశారు. 

2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో సంస్థ రూ.516.20 కోట్ల విలువైన 14,70,861 మెట్రిక్ టన్నుల బొగ్గును కొనుగోలు చేసినట్లు చూపించారు అయితే, బ్యాంకుల ఫోరెన్సిక్ ఆడిట్ ప్రకారం సంస్థ ఆవరణలో అంత బొగ్గు నిల్వలేదు. కొంత బూడిద మాత్రమే ఉంది. బొగ్గు కొనుగోలు రశీదులు అడిగితే చెదలు పట్టి పాడైపోయాయని చెప్పారు. 

సరఫరా వివరాలను వేబ్రిడ్జిలో పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే, సమాచారం కంప్యూటర్లలో స్టోర్ కాలేదని చెప్పారు. సరైన రికార్డులు లేవు. కంపెనీ లావాదేవీల్లో అవకతవకలపై బ్యాంకులు ఎప్పుడు ప్రస్తావించినా ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో సంస్థను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చారు. నిందితులంతా కలిసి తమ ప్రయోజనం కోసం ప్రయత్నించి రూ.826.17 కోట్ల నష్టం కలిగించారు దానిపై ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద సైతం కేసులు నమోదు చేశారు. 

నిందితులు వీరే....

1. ఇండ్ - భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్
2. కనుమూరు రమాదేవి (డైరెక్టర్)
3. కనుమూరు రాజు రఘురామకృష్ణ (డైరెక్టర్)
4. కోటగిరి ఇందిర ప్రియదర్శిని (డైరెక్టర్)
5. గోపాలన్ మనోహరన్ (అదనపు డైరెక్టర్)
6. సీతారామం కొమరగిరి (ఎండీ)
7. నారాయణ ప్రసాద్ భాగవతుల (అదనపు డైరెక్టర్)
8. నంబూరి కుమారస్వామి (డైరెక్టర్)
9. బొప్పన సౌజన్య (అదనపు డైరెక్టర్)
10. వీరవెంకట సత్యనారాయణ రావు వడ్లమాని (అదనపు డైరెక్టర్)
11. విస్సాప్రగడ పేర్రాజు (అదనపు డైరెక్టర్)

Follow Us:
Download App:
  • android
  • ios