వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఆలౌట్ చేయాలని వైసీపీ భావిస్తున్నది. ఇందులో భాగంగా సీఎం జగన్ ప్రతిపక్షాల కంచుకోటలపై కన్నేశారు. ఆ నియోజకవర్గాలకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ముందుగానే వచ్చే ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించేస్తున్నారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాలుగా పాలిటిక్స్ హీటెక్కిపోయాయి. ప్రతిపక్షాలు జతకట్టడంపై ఫోకస్ పెట్టాయి. పొత్తుగా వైసీపీని ఓడించాలనే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, ప్రభుత్వం ప్రతిపక్షాల నియోజకవర్గాలపై కాన్సంట్రేషన్ చేస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘మిషన్ 175’ని సాధించి తీరాలని అందుకు తగిన వ్యూహంతో జగన్ పార్టీ కసరత్తులు చేస్తున్నది.

2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 సీట్లను గెలుచుకుని తిరుగులేని విధంగా నిలిచింది. కాగా, టీడీపీ మాత్రం సెంచరీ కౌంట్ నుంచి 23కు పడిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పొందిన ఆ సీట్లను కూడా సాధించాలనే లక్ష్యాన్ని పార్టీ ముందు పెట్టారు. ఇందుకు ఓ వ్యూహాన్ని కూడా పార్టీ అమలు చేస్తున్నది. 

గత ఎన్నికల్లో ప్రతిపక్షాలు గెలిచిన 23 స్థానాలతోపాటు, స్వల్ప మెజార్టీతో వైసీపీ గెలిచిన 22 అసెంబ్లీ సెగ్మెంట్లపై వైసీపీ ప్రధానంగా దృష్టి సారించింది. వీటిని కచ్చితంగా వైసీపీ మంచి మెజార్టీతో గెలుచుకోవాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం పార్టీలో గ్రూపు రాజకీయాలు లేకుండా చేయడమే కాదు.. 2024 ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి పోటీ చేయబోతున్న అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 

Also Read: భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలగిన అడ్డంకులు.. త్వరలోనే శంకుస్థాపన : బొత్స సత్యనారాయణ

గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకు ప్రభుత్వం పెద్దగా ఫండ్స్ ఇచ్చేది కాదు. కానీ, జగన్ ఇందుకు భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ప్రతిపక్ష నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి ఒక నేతను ఫోకస్ చేస్తున్నారు. వీలైతే.. ఆయనను ఎమ్మెల్సీ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అధికార పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ విధంగా ప్రతిపక్షాల నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలనే కాదు.. అక్కడి ప్రజలతోనూ కలిసిపోయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించే వైపుగా శ్రమించాలని సదరు నేతలకు జగన్ సూచనలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే ఏలూరు, కుప్పం, టెక్కలి, మండపేట, అద్దంకిలోని పార్టీ క్యాడర్‌తో జగన్ నేరుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్నది. చంద్రబాబుకు పెట్టని కోటగా ఉండే కుప్పంలోనూ ఈ వ్యూహాన్ని అమలు చేసి ఓ మేరకు విజయాన్ని కూడా జగన్ సాధించారు. కుప్పం నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తూ.. స్థానిక ఎన్నికల్లో మంచి విజయాన్ని కైవసం చేసుకున్నారు.

కుప్పంలో 33 ఏళ్ల కేఆర్జే భారత్‌ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్యాండిడేట్‌గా నిర్ణయించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఆయనను ఎమ్మెల్సీ చేశారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 56 కోట్లు కేటాయించారు. ఏడాదిలోపు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేశారు.

Also Read: అమరావతికి జగన్ మద్దతు ఇచ్చారు.. లేకుంటే రైతులు ల్యాండ్ ఇచ్చేవాళ్లు కాదు: ఉండవల్లి అరుణ్ కుమార్

అదే విధంగా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పోస్టు ఆఫర్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచిన ఈ నియోజకవర్గంలో వైసీపీ గ్రూపు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడిపై ఓడిన పేరడ తిలక్‌ను ఈ సారి పక్కనపెట్టి దువ్వాడ శ్రీనివాస్‌ను 2024 అభ్యర్థిగా ప్రకటించారు. తిలక్‌కు ఎమ్మెల్సీ పోస్టు హామీ ఇచ్చి.. శ్రీనివాస్ గెలవడానికి పని చేయాలని సూచనలు చేశారు. ఇక్కడ అభివృద్ధి కోసం రూ. 1,026 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.

టీడీపీ కంచుకోట అద్దంకి సెగ్మెంట్‌లో ఇప్పటికే రూ. 1,081 కోట్ల నిధులను ఖర్చు చేశారు. 2024 ఎన్నికల్లో బీ క్రిష్ణ చైతన్యను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. మరో టీడీపీ నియోజకవర్గం మండపేటలో రూ. 946 కోట్లు ఖర్చు పెట్టారు. తోట త్రిమూర్తులను అభ్యర్థిగా వైసీపీ నిర్ణయించింది.

వైసీపీ స్వల్ప మెజార్టీతో గెలిచిన స్థానాల్లోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓటేస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వస్తున్నాయి.